వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లాలో ఎక్కడ చూసిన నీళ్లే కన్పిస్తున్నాయి. జలాశయాలతో పాటు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలకళ చూసి అందరూ సంతోషిస్తుంటే.. మరికొందరు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరాల్లో వరదలతో రోడ్లు వాగులను తలపిస్తుంటే.. పొంగుతున్న వాగుల వల్ల అసలు రోడ్లే లేని కొన్ని మారుమూల గ్రామాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. నిర్మల్ జిల్లా గంగాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని దత్తజీపేటలో ఓ గర్భిణీకి ఎదురైన పరిస్థితే ఇందుకు నిదర్శనం.
అసలే వర్షం... ఆపై పొంగుతున్న వాగు...
దత్తాజీపేట గ్రామంలోని రొడ్డ ఎల్లవ్వ అనే గర్భిణీకి తెల్లవారుజామున సనాలుగింటి సమయంలో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. గ్రామానికి దగ్గర్లో ఉన్న కడెం ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అసలే రాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షం. ఆపై వాగులు పొంగుతున్నాయి. కడెం మండల కేంద్రానికి దత్తజీపేటకు మధ్యలో గంగాపూర్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఏ వాహనదారున్ని అడిగినా... "వాగు బాగా పొంగుతోంది. దాటటం కష్టమైతది. మధ్యలో దిగపడితే ఎట్లా. అబ్బో... నేనైతే రాను. వేరే ఎవరినన్నా చూసుకోండి." అంటూ సమాధానాలు. తెలిసిన వాహనదారులందరికీ కుటుంబసభ్యులు ఫోన్లు చేశారు. అందరినీ బతిమిలాడగా... ఓ వాహనదారుడు ఒప్పుకున్నాడు. అవతలివైపు నుంచి ఇవతలికి రావటానికి కొంత ఇబ్బంది అయినా.. ఎలాగోలా వాగు దాటి.. గర్భిణీ ఇంటికి ఆలస్యంగా వచ్చేసింది. బాధితురాలిని తీసుకుని కడెంకు వెళ్లేందుకు తిరుగుపయణమైంది. మళ్లీ వాగు దాటే.. కడెంకు వెళ్లాలి.
వాగు దాటక ముందే ప్రసవం..
అసలే వాగు పొంగుతోంది. అందులోనూ వాహనంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ ఉంది. ఇవన్నీ గమనించిన డ్రైవర్... వాహనాన్ని నెమ్మదిగా... చాలా జాగ్రత్తగా పోనిస్తున్నాడు. వాగు దగ్గరికి రాగానే ప్రవాహం పెరిగింది. గట్టుపైనే వాహనం ఆగిపోయింది. అప్పటికే చాలా ఆలస్యం కాగా... పురిటినొప్పులు ఎక్కువై.. వాహనంలోనే ఎల్లవ్వ ప్రసవించింది. వాగు ప్రవాహం కాస్త తగ్గాక... తల్లిబిడ్డలు ఉన్న వాహనాన్ని ట్రాక్టర్ సహాయంతో వాగు దాటించారు. అక్కడి నుంచి అదే వాహనంలో కడెం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆస్పత్రి సిబ్బందికి ఫోన్ చేసి పరిస్థితి వివరించగా... సిద్ధంగా ఉన్నారు. ఆస్పత్రికి చేరుకోగానే తల్లిబిడ్డలకు వైద్య పరీక్షలు చేశారు. ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలపడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
వంతెన వేయించాలి...
ఎప్పుడు భారీ వర్షం పడినా... ఇలాంటి దుస్థితే ఎదురవుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైతే.. తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నారని.. మరి ఈ ఘటనలో ఏదైనా అపశ్రుతి దొర్లితే... దానికి బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి... గంగాపూర్ వాగుపై వంతెన నిర్మాణం చేయించాలని వేడుకుంటున్నారు.