నిర్మల్ జిల్లాలో మారుమూల ప్రాంతమైన కడెం మండల పరిధిలోని కోలంగూడెంలో నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు నిత్యావసర సరుకులు పంచారు. కేర్ మెడికల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సరుకుల పంపిణీలో ఎస్పీ పాల్గొన్నారు. రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల ఆయన ద్విచక్ర వాహనం మీద కోలంగూడెంకి వెళ్లారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో లాక్డౌన్కు సహకరిస్తున్న మారుమూల ప్రాంతాల ప్రజలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
లాక్డౌన్ సందర్భంగా మారుమూల ప్రాంతాల వారు నిత్యావసర సరుకులు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి బాధపడ్డానన్నారు. ఈ విషయం తెలియగానే.. కేర్ మెడికల్స్ సహాయంతో జిల్లా పోలీసులు నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమన్నారు.
రాబోవు వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తతలు పాటించాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, అలాగే సామాజిక దూరాన్ని పాటించాలని తెలిపారు.
నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, యువత పెడదారి పట్టకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు రావాలన్నారు. యువతకు ఎలాంటి అవసరం వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు. గోండుగూడెంలో 50 కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు, నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఖానాపూర్ సీఐ జైరాం నాయక్, కడం ఎస్సై ప్రేమ్ దీప్, ఖానాపూర్ ఎస్సై భవాని సేన్, దస్తురాబాద్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!