నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని సుప్రసిద్ధ అడెల్లి పోచమ్మ ఆలయంలో కరోనా కారణంగా ఈనెల 19 వరకు పండగలు, పూజలను దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నిషేధించారు. ఎవరూ రావద్దని ప్రకటించారు. అయితే వీటన్నిటినీ కాదని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి(డీఅర్డీఓ) వెంకటేశ్వర్లు అమ్మవారి వద్ద పూజలు నిర్వహించారు. అంతటితో ఆగిపోకుండా బంధువులకు విందు కూడా ఏర్పాటు చేశారు. నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులే ఆ విందులో పాల్గొన్నారు. మాస్కు ధరించకుండా... భౌతిక దూరం పాటించకుండా వేడుకలకు హాజరయ్యారు.
సాధారణంగా ఆలయం వద్ద ఉన్న అటవీశాఖ నందనవనంలో వేడుకలు నిర్వహించడం నిషిద్ధం. కానీ... ఇక్కడ అవేవీ అడ్డుకాలేదు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డిస్కం ఎస్ఈ జయవంత్ చౌహన్, నిర్మల్ మున్సిపల్ కమీషనర్ బాలకృష్ణతో పాటు అనేక మంది ఈ వేడుకల్లో పాల్గొనడం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యం చూసిన స్థానికులంతా చట్టాలు, ఆంక్షలు సామాన్యులకే తప్ప అధికారులకు కాదంటూ విమర్శలు చేస్తున్నారు. వేడుకలకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు... అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని చర్చించుకుంటున్నారు.
ఇదీ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!