Man Allegations on Postal Staff : నిర్మల్ జిల్లా కుంటాల మండలం దౌనెల్లిలో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగం కోల్పోయానని ఓ వ్యక్తి ఆరోపించారు. గ్రామానికి చెందిన నాగభూషన్‌కు ఎంప్లాయిమెంట్ కార్యాలయం నుంచి జనవరి 14వ తేదీన కాల్‌లెటర్ జారీ అయ్యింది. నిర్మల్ పురపాలికలో క్లీనర్ ఉద్యోగానికి ఫిబ్రవరి 14వ తేదీన ముఖాముఖికి హాజరుకావాలని పంపించారు. ఆ ఉత్తరం ఫిబ్రవరి 14న సాయంత్రం అందించారని నాగభూషణ్ ఆరోపించారు.
మరుసటి రోజు జిల్లా కార్యాలయానికి వెళ్లి అడగ్గా... పోస్టు భర్తీ చేశామంటూ అధికారులు చెప్పారని వెల్లడించారు. ఖాళీని భర్తీ చేశామని... తాము ఏం చేయలేమని అధికారులు అన్నారని వాపోయారు. ఏదైనా ఉంటే తపాలా కార్యాలయంలోనే అడగాలని అన్నారని... ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా తపాలా అధికారులను చరవాణి ద్వారా వివరణ కోరగా... కాల్‌లెటర్ ఈనెల 8న కుంటలకు చేరుకుందని... వెంటనే పోస్ట్ మెన్ ద్వారా పంపించామని తెలిపారని అన్నారు. దౌనెల్లి గ్రామానికి వెళ్లి వారు ఇంట్లో లేకపోవటంతో పక్కవారికి ఇచ్చి వచ్చామని పేర్కొన్నారు.
ఎంప్లాయిమెంట్ ఆఫీసు నుంచి నాకు కాల్ లెటర్ వచ్చింది. పోస్టాఫీసు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆ లెటర్ సమయానికి చేరలేదు. ఈనెల 14న పదకొండు గంటలకు ఇంటర్వ్యూ ఉంది. అయితే అదేరోజు సాయంత్రం... వేరే వాళ్లతో నాకు లెటర్ పంపించారు. మరుసటి రోజు నేను ఆఫీసుకు వెళ్లాను. ఇంటర్వ్యూలు అయిపోయాయని చెప్పారు. ఏదైనా ఉంటే పోస్టాఫీసు సిబ్బందిని అడగాలని చెప్పి... నన్ను పంపించారు. లెటర్ ఆలస్యంగా రావడం వల్ల ఉద్యోగం కోల్పోయా. చాలా బాధగా ఉంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
-నాగభూషణ్, బాధితుడు
ఇదీ చదవండి: 'సమ్మక్క జాతరకు బయల్దేరారు.. ఇల్లు కాలిందని ఫోన్ చేశారు'