నిర్మల్ జిల్లాలోని భైంసా ప్రాథమిక ఆస్పత్రి వైద్య సిబ్బంది ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. కొవిడ్ బారిన పడిన గర్భిణులకు అండగా నిలుస్తూ.. వైద్య సేవలు అందిస్తూ ప్రసవాలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ సోకిన గర్భిణులకు వైద్యం అందించడం లేదు. ఈ సమయంలో కొవిడ్ సోకిన గర్భిణులకు నిర్మల్లోని భైంసా ప్రాథమిక ఆస్పత్రి దేవాలయంలా మారింది. తమ బిడ్డలకు జన్మనిచ్చే గర్భగుడిలా కనిపిస్తోంది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ప్రసూతి విభాగం ఆరోగ్య సిబ్బంది సువర్ణ, త్రివేణి, శైలజ, సునీత, మంజూష... కొవిడ్ రోగులకు చికిత్స చేస్తూనే... వైద్యుల సలహాలపై గర్భిణులకు శారీరక వ్యాయామాలు చేయిస్తూ సాధారణ ప్రసవం జరిగేలా చూస్తున్నారు. వారి కృషి ఫలితంగానే ఇప్పటి వరకు ఏడుగురు కొవిడ్ బాధిత గర్భిణులు పండండి బిడ్డలకు జన్మనిచ్చారు. వైద్య వృత్తిలో ఉంటూ తమవంతుగా గర్భిణులకు సాయం చేస్తున్నామని వైద్యులు, సిబ్బంది తెలిపారు.
అయినవాళ్లే రానివ్వని వేళ… మేమున్నామంటూ సాయం చేస్తున్న వైద్య సిబ్బంది సేవలు వర్ణణాతీతం. ఓ ప్రాణానికి జన్మనిచ్చేందుకు.. ఓ ప్రాణాన్ని కాపాడేందుకు... తమ ప్రాణాన్ని పణంగా పెడుతున్న వారి మానవత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తప్ప ఏమిచెప్పగలం.
ఇదీ చూడండి: ప్రాణాలు పోయే ముందు గాంధీకి వస్తున్నారు: ఈటల