చెరువు భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చెరువు భూముల పరిరక్షణపై సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చెరువుల భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పట్టణ సమీపంలోని కంచరోనీ చెరువులోని ఆక్రమణలు తొలగించి వెంటనే కంచె ఏర్పాటు చేయాలని, ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాలోని చెరువు శిఖం భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా దశలవారీగా కంచె ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. నీటిపారుదల, రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో ప్రభుత్వ భూములను గుర్తించి రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాఠోడ్ రమేశ్, నీటి పారుదల శాఖ ఈఈ మల్లికార్జున్ రావు, తహసీల్దార్ సుభాశ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.