నిర్మల్ జిల్లాలో పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పట్టణ ప్రగతి పనులపై గురువారం మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాల అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. బకాయిలు లేకుండా ప్రతి నెలా విద్యుత్ బిల్లులను చెల్లించాలని సూచించారు. బ్యాంకుల ఆర్థిక సహకారంతో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, ట్రాలీల వాయిదాలు క్రమం తప్పకుండా చెల్లించాలన్నారు.
ఐదు వార్డులకు ఒక నర్సరీ..
నూతన మున్సిపల్ చట్టం ప్రకారం జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపల్ బడ్జెట్ నుంచి పదిశాతం గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించాలని ఆదేశించారు. ప్రతి ఐదు వార్డులకు ఒక నర్సరీ చొప్పున ఏర్పాటు చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని, దోమల నివారణకు రసాయన మందులు పిచికారీ చేయాలన్నారు. ప్రతి కాలనీలో తడిచెత్త, పొడిచెత్త వేరు వేరుగా, ప్లాస్టిక్‌ను ప్రత్యేకంగా సేకరించాలన్నారు. నూతనంగా విలీనమైన గ్రామాలలో నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
ప్రతి మున్సిపల్ బడ్జెట్లో జరిగిన లావాదేవీలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర రావు, విద్యుత్ శాఖ ఎస్ఈ జైవంత్ రావు చౌహన్, ఇతర అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.