నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగాంకు చెందిన సాయి కృష్ణ... భైంసాలోని శ్రీ సరస్వతి శిశు మందిరం సుభద్ర నిలయంలో తొమ్మిద తరగతి చదువుతున్నాడు. గతేడాది లాక్డౌన్లో ఖాళీగా ఉండకుండా... తన వద్ద ఉన్న సైకిల్‌ను ఎలక్ట్రిక్ సైకిల్‌గా మార్చాలని అనుకున్నాడు. తనకొచ్చిన ఆలోచనను తండ్రితో పంచుకున్నాడు. తన కల సాకారం కావటానికి... కావలసిన పరికరాలన్నింటినీ సమకూర్చుకున్నాడు.
ఎలక్ట్రిక్ సైకిల్‌కు 2 బ్యాటరీలు, ఒక హెవీ మోటార్‌ను బిగించి వాటిని వైర్లతో అనుసంధానం చేశాడు. తనకున్న పరిజ్ఞానం, తండ్రి సహకారంతో... సాయి కృష్ణ తక్కువ ఖర్చులో ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేశాడు. రెండు బ్యాటరీలు ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్లు సైకిల్‌ను నడపవచ్చని సాయికృష్ణ తెలిపాడు. ఈ ఎలక్ట్రికల్ సైకిల్ తయారీకి దాదాపు రూ. 8 వేల వరకు ఖర్చు అయిందని చెబుతున్నాడు.
ప్రస్తుతం తన వద్ద ఉన్న బ్యాటరీలతొ 20 కిలోమీటర్లు నడపచ్చని... ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీలను అమరిస్తే ఎక్కువ మైలేజీ వస్తుందని అంటున్నాడు. ఎవరికైనా ఎలక్ట్రిక్ సైకిల్ కావాలనుకుంటే... ఆర్డర్‌పైన తయారుచేసి ఇస్తానని సాయికృష్ణ చెబుతున్నాడు. ప్రస్తుతం గ్రామంలో తాను తయారు చేసుకున్న ఎలక్ట్రికల్ సైకిల్‌పైనే చక్కర్లు కొడుతూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు.