హిందూ, ముస్లిం భాయీభాయీ అనే పదాన్ని నిజం చేసి చూపించారు... నిర్మల్లోని సహారా యూత్ యువకులు. బిక్షాటన చేస్తూ... జీవనం సాగించే ఓ హిందూ మహిళ మృతదేహానికి ముస్లింలు దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటారు.
నిర్మల్లోని గాజులపేట్లో కిషన్రాజ్ గోండ్, ఎల్లమ్మ దంపతులు ఓ పూరిగుడిసెలో ఉంటూ బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గతేడాది క్రితం ప్రమాదం జరగ్గా వైద్యులు ఎల్లమ్మ కాలును తొలగించారు. అప్పటి నుంచి వృద్ధురాలు గుడిసెలోనే ఉంటోంది.
ఎక్కడికక్కడా లాక్డౌన్ కొనసాగటం వల్ల ఎల్లమ్మను గమనించిన గాజులపేట్కు చెందిన ముస్లిం యువకులు, సహారా యూత్ సభ్యులు రెండు పూటలా భోజనం అందించారు. ఎండ వేడికి తాళలేక ఎల్లమ్మ మృతిచెందింది. కరోనా వైరస్ కారణంగా దహన సంస్కారాలకు ఎవరూ ముందుకు రాకపోవటం వల్ల... స్థానిక కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లాహను హోంగార్డు అజహార్ సంప్రదించారు. వెంటనే సహారా యూత్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి వారి స్వంత ఖర్చులతో హిందూ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. కిషన్రాజ్ గోండ్ను సహారా యూత్ తరఫున ఆదుకుంటామని తెలిపారు.