కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలకు రూ.7,650 కోట్లు కేటాయించిందని.. ఆ నిధులను ఏవిధంగా ఖర్చు చేశారో కేసీఆర్ చెప్పాలని ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేశారు. నిర్మల్లోని భాజపా కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా నియంత్రణకు కేంద్రం సాయం చేస్తే.. ఏం చేయలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైరస్ కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఏం చేయలేక సచివాలయ కూల్చివేతతో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రైతుబంధు అందక రైతులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎంతో ఆర్భాటంగా ఏటా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో వెల్లడించాలన్నారు. అడెల్లి నుంచి బోథ్ వరకు చేపట్టే రహదారి నిర్మాణానికి నిధులు లేకున్నప్పటికీ పనులు ప్రారంభించడం వెనుక ఆంతర్యం ఏమిటో ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. నిధులు మంజూరు.. వాటి ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
ఇదీ చదవండి : 'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'