నిర్మల్ జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం సమీక్షించారు. కలెక్టరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరం, వెయిటింగ్ హాల్‌ను ప్రారంభించారు.
వేగవంతం చేయాలి...
జిల్లాలోని 582 పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయడంలో రాష్ట్రంలోనే జిల్లాకు మొదటి స్థానం దక్కిందన్నారు. రైతు వేదికలు పూర్తి చేయడంలో రెండో స్థానంలో ఉందని తెలిపారు. మొత్తం 79 రైతు వేదికలకు గాను ఇప్పటివరకు 53పూర్తి అయ్యాయని... మిగతా వాటి పనులు చివరిదశలో ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన కాలనీల్లో విద్యుత్, తాగు నీరు, డ్రైనేజి పనులను పూర్తి చేయాలనీ సూచించారు. భూముల క్రమబద్దీకరణ గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. నిర్మల్‌లో 13,600, బైంసాలో 6,800, ఖానాపూర్‌లో 1,800 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
"రైతులు నియంత్రిత పద్ధతి లో పంటలు సాగుచేసేలా వ్యవసాయశాఖ అధికారులు అవగాహనా కల్పించాలి. మొక్కజొన్న నిల్వలు అధికంగా ఉన్నందున... శెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు పండించేలా రైతులను ప్రోత్సహించాలి. పత్తిని సీసీఐ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. వానకాలం వరి ధాన్యాన్ని 155 కేంద్రాల్లో కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేయాలి."
-మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.