లాక్డౌన్ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంతో పాటు ప్రజలపైన ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో లాక్డౌన్ అమలు తీరుతెన్నులను మంత్రి పర్యవేక్షించారు. బస్ స్టాండ్ ఏరియా, బుధవార్ పేట్, గాంధీ చౌక్, బంగల్ పేట్, బాలాజీ వాడ, బ్రహ్మపురి, తదితర ప్రాంతాల్లో కలియతిరుగుతూ పరిస్థితులను పరిశీలించారు. కూరగాయాల దుకాణాలు, రేషన్ షాపులను పరిశీలించి దుకాణాదారులతో మాట్లాడారు. కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించాలని, మాస్కులను తప్పనిసరిగా వాడాలని సూచించారు.
లాక్డౌన్ పూర్తయ్యేవరకూ ప్రజలెవరూ బయటకు రావద్దని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో నిర్మల్ పట్టణం రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్కు వచ్చామని... ప్రజలు ఇదే విధంగా సహకరిస్తే గ్రీన్ జోన్లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, ఎస్పీ శశిధర్ రాజు, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఎస్సాసీయస్ ఛైర్మన్ ధర్మాజీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి