మట్టిపై ఉన్న మమకారాన్ని అందమైన శిల్ప సౌందర్యంగా తీర్చిదిద్దుతున్నాడు నిర్మల్ జిల్లాకు చెందిన కోటగిరి గోపి. తన అద్భుత నైపుణ్యంతో మట్టికే ప్రాణం పోస్తున్నాడు. ప్రియదర్శినినగర్‌కు చెందిన గోపి వృత్తి రీత్యా స్వర్ణకారుడు. చాలామందికి స్వర్ణకారునిగా పరిచయమైన ఇతనిలో దాగున్న ఆద్భుత కళాకారుడి గురించి ఎక్కువమందికి తెలియదు. మట్టిపై ఈయనకున్న మమకారం.. ఆకట్టుకునే అనేక కళారూపాలకు జీవం పోస్తోంది. అతడి కళానైపుణ్యానికి విదేశాల్లో కూడా మంచి గుర్తింపు లభిస్తోంది.
పెద్దనాన్న స్ఫూర్తితో..
గోపి పెద్దనాన్న మట్టితో వినాయక విగ్రహాలను రూపొందించేవారు. సుమారు ఏడేళ్ల వయస్సులో పెద్దనాన్న చేసే విగ్రహాలను గమనించిన గోపి సైతం మట్టిపై ఆసక్తి పెంచుకున్నారు. అప్పటినుంచి విగ్రహాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తూ కొద్ది రోజుల్లోనే దానిపై పట్టు సాధించాడు. ముఖ్యంగా వినాయక విగ్రహాలంటే ఇష్టపడే ఈయన అనేక రకాల భంగిమల్లో గణేషుని విగ్రహాలను తీర్చిదిద్దాడు. ప్రతియేటా మట్టితో తయారుచేసిన విగ్రహాలనే వినాయక చవితి సమయంలో ప్రతిష్ఠించడం అలవాటుగా మార్చుకున్నాడు. తనతో పాటు మరికొంతమందికి విగ్రహాలను ఉచితంగా తయారుచేసి ఇస్తున్నాడు.
"మట్టి విగ్రహాలే అయినా దీర్ఘకాలం మన్నెలా జాగ్రత్తలు తీసుకుంటున్నా. ప్రస్తుతం ఫ్రేముల రూపంలో ప్రతిమలను తయారుచేస్తూ.. శ్రమను బట్టి వాటికి ధరలు నిర్ణయిస్తున్నా. ఒక్కో విగ్రహం తయారీకి కనీసం రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతోంది. దేవతల విగ్రహాలు తయారుచేసేపుడు ఆభరణాలు, దుస్తులు, కిరీటాలు, ఆయుధాలను అందంగా మలచడానికి ఎక్కువ శ్రమిస్తుంటాను. అందుబాటులో ఉన్న చెంచాలనే విగ్రహాలు తయారీకి ఉపయోగిస్తాను. వివిధ నాయకుల విగ్రహాల తయారీలో వారి అలవాట్లు, ఆహార్యాన్ని సులభంగా గుర్తించేలా విగ్రహం తయారుచేయడం కష్టమే. అయినప్పటికీ వాటిపై ఇష్టంతో తయారు చేస్తున్నాను. చిన్న పరిమాణం నుంచి సుమారు 5 అడుగుల విగ్రహాల వరకు రూపొందిస్తున్నాను. ఆసక్తి ఉన్నవారికి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నా"
-- కోటగిరి గోపి. కళాకారుడు.
ప్రవృత్తిగా..
వృత్తి రీత్యా స్వర్ణకారుడైన గోపి.. వృత్తి నిర్వహిస్తూనే ప్రవృత్తి కోసం ప్రతీరోజు వివిధ దేవతామూర్తులు, జాతీయ నాయకుల విగ్రహాలను రూపొందిస్తున్నారు. మామూలు నల్లమన్నుతో ఈయన రూపొందిస్తున్న విగ్రహాలు చూడముచ్చటగా ఉండి అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేవతలతో పాటు జాతీయ నాయకులు, రాజకీయనేతల ప్రతిరూపాలను తయారు చేస్తూ నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. పర్యావరణ హితం కోసం అందరూ మట్టినే వినియోగించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌కు దూరంగా ఉండాలని సందేశాన్ని పంచుతున్నారు.
ఇదీ చూడండి: భారత్‌లో కార్యకలాపాలకు 'టిక్‌టాక్' గుడ్‌బై