నిర్మల్ జిల్లా ప్రాంతీయ, ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధితో జిల్లావాసులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన స్థాయీ సంఘ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, ఈ విషయంలో ప్రజలను మరింత చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విలువైన డయాలసీస్, ఐసీయూ సేవలు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. 108 పైలట్ మృతితో ఇటీవల చోటుచేసుకున్న కొవిడ్ 19 టీకా అలజడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
గంజాయి నివారణ చర్యలు
ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు మొదలుకానున్న నేపథ్యంలో.. తగిన ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. తల్లిదండ్రుల నుంచి విధిగా అనుమతి పత్రం పొందాలన్నారు. జిల్లాలో గంజాయి వినియోగం పెరుగుతోందని, నివారణ చర్యలు చేపట్టాలని ఆబ్కారీ శాఖ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ప్రగతి నివేదికలు వినిపించారు.
మిషన్ భగీరథ నీటి సరఫరాలో లీకేజీ సమస్య ఇబ్బందిగా మారిందని జడ్పీటీసీ సభ్యుడు జీవన్‌రెడ్డి వాపోయారు. కుబీరు మండలంలోని డొడర్న పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం రావడం లేదని జడ్పీటీసీ సభ్యురాలు ఆల్కతాయి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్ పర్సన్ కౌడిపెట్లి విజయలక్ష్మి ముథోల్ శాసనసభ్యుడు విఠల్ రెడ్డి, జడ్పీసీఈఓ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ శాఖల్లో పదోన్నతి ప్రక్రియపై సీఎం కేసీఆర్ ఆరా