ప్రతి సంవత్సరం వేసవిలో నిర్మల్ జిల్లా బాసర ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. పాఠశాలలు ఆరంభమయ్యే ముందు చిన్నారుల అక్షరాభ్యాసాలకు, పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులతో తల్లిదండ్రులు తమ మొక్కులు తీర్చుకునేందుకు భారీ సంఖ్యలో బాసర ఆలయానికి వస్తారు. అయితే గత మార్చి 23వ తేదీ నుంచి ఆలయానికి భక్తులరాక నిలిచిపోయింది. లాక్‌డౌన్ వలన ప్రజా జీవితం స్తంభించిపోవటం, అన్‌లాక్ తర్వాత ఆలయంలోకి చిన్నారులను అనుమతించకపోవటంతో పూజా టికెట్ల విక్రయాలు, అతిథిగృహాల అద్దెలు, హుండీ ఆదాయం లేక ఆలయం ఆర్థికంగా కష్టాలు ఎదుర్కుంటోంది.
గత జూన్ 8 నుంచి ఆలయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించినా భక్తులు రావటం లేదు. బాసరకు ప్రధానంగా రైళ్ల ద్వారా భక్తులు ఎక్కువగా వస్తుంటారు. రైళ్లు నడవకపోవటంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర నుంచి భక్తులు రాకపోవటంతో ఆలయంలో సందడే కనిపించటం లేదు. ప్రస్తుతం ప్రతిరోజూ 100 నుంచి 200 మంది భక్తులు మాత్రమే ఆలయాన్ని సందర్శిస్తున్నారు.
అయిదు నెలల్లో రూ.5 కోట్ల నష్టం
బాసర ఆలయానికి వేసవి కాలంలోనే భక్తుల తాకిడి ఎక్కువ. ఈ సంవత్సరం వేసవిమొత్తం లాక్‌డౌన్‌లోనే గడిచిపోయింది. అక్షరాభ్యాసాలు జరగటం లేదు. దీంతో అయిదు నెలలుగా హుండీ ఆదాయం సైతం నిలిచిపోయింది. నెలకు సగటున రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు హుండీ ఆదాయాన్ని ఆలయం కోల్పోయింది. మాములు రోజుల్లో నెలకు రూ.40 లక్షలకుపైగా వచ్చే హుండీ ఆదాయం ఈసారి జులై 7న హుండీలను తెరవగా 154 రోజుల్లో రూ.51 లక్షలకు పరిమితమైంది. టికెట్ల విక్రయం, ప్రసాదాల విక్రయం, అతిథిగృహల అద్దెలు, ఇతరత్రా ఆదాయం నెలకు రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్ల వరకు ఉంటుంది. ఇదే పరిస్థితి కొనసాగితే సిబ్బందికి వేతనాలు ఇవ్వడం కష్టంగా కనిపిస్తోంది.
వ్యాపారులకు నష్టాలు
బాసర ఆలయంపై ఆధారపడి వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. లాక్‌డౌన్ వలన ఆలయం, గోదావరి వద్ద దుకాణాల యాజమానులు, ఆటో చోదకులు, గోదావరిలో నాటుపడవలు తిప్పేవారు ఇలా చాలమంది ఆర్థికంగా నష్టపోయారు. సడలింపులు ఇచ్చిన అనంతరం భక్తులు రాకపోవటంతో వారి కష్టాలు కొనసాగుతున్నాయి. సంవత్సరానికి లక్షలాది రూపాయల అద్దెలను కట్టే వ్యాపారులు ఆర్థికంగా చితికిపోయారు. గిరాకీ అధికంగా ఉండే వేసవి మొత్తం వ్యాపారాలు లేక ఇబ్బందుల్లో పడ్డారు. అయిదు నెలలుగా వ్యాపారాలు లేకపోవటం, ఆలయం తెరిచినా భక్తుల సందడిలేక వ్యాపారులు నష్టపోతున్నారు.
లాక్‌డౌన్‌ను సడలించిన అనంతరం మిగతా గ్రామాలు, పట్టణాల్లో వ్యాపారాలు యథావిధిగా సాగుతుండగా బాసరలో మాత్రం ఇప్పటికీ దుకాణాలను తెరవలేదు. భక్తులు లేకపోవటంతో దుకాణాలను తెరచినా లాభంలేదని, నిర్వహణ భారమవుతుందని వ్యాపారులు దుకాణాలు తెరిచే ఆలోచనను విరమించుకున్నారు. కరోనా వ్యాధి ఎప్పుడు అంతమవుతుందో..ఎప్పుడు ఆలయం కళకలలాడే రోజులు వస్తాయో అని బాసరవాసులు ఎదురుచూస్తున్నారు.