తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సర్వసతి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి చతుర్వేద సహిత సరస్వతి యాగం, చండీ హోమం, శ్రీ వేద వ్యాసుని ఆలయంలో వేద ఉపనిషత్తుల పారాయణం ఆలయ అర్చకులు చేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున వేద వ్యాస మహర్షికి పట్టువస్త్రాలను ఆలయ ఈవో వినోద్ రెడ్డి సమర్పించారు.
అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులను ముందుగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి ఆలయంలోకి అనుమతించారు. 10 ఏళ్ల లోపు పిల్లలకు అక్షరాభ్యాసం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం జరగాల్సిన వేద పండితుల సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. కొవిడ్- 19 కారణంగా ఆలయంలో భక్తుల రద్దీ నామమాత్రంగానే ఉంది.