హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ శాఖ ఆగస్టు 31 నాటికి వంద శాతం లక్ష్యం పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో హరితహారం అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు.
ప్రత్యేక చర్యలు...
జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించే విధంగా ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, సేగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామ అంతర్గత రోడ్లు, పంచాయతీ రాజ్, రహదారులు భవనాల శాఖ రోడ్లు, అటవీ, ప్రభుత్వ ఖాళీ ప్రదేశాలలో విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.
వంద శాతం పూర్తి చేయాలి...
అధికారులు సమన్వయంతో ఆరో విడత హరితహారంలో భాగంగా జిల్లా లక్ష్యం పూర్తి చేసేందుకు వేగవంతంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి రోజు శాఖల వారీగా నాటిన మొక్కల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఆగస్టు 31 నాటికీ ప్రతి శాఖ లక్ష్యం వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి : నదీజలాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి రెడీ: కేసీఆర్