Governor Tamilisai: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు బాసర ఆర్జీయూకేటీలో పర్యటించనున్నారు. అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన గవర్నర్.. ఇప్పటికే బాసర చేరుకున్నారు. తొలుత బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్‌కు ఆలయ అర్ఛకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం గవర్నర్ ఆర్జీయూకేటీకి వెళ్లనున్నారు. అక్కడ విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి.. వారితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. విద్యార్థులు, బోధకులతో, సిబ్బందితో మాట్లాడి సమస్యలపై ఆరా తీయనున్నారు.
గవర్నర్ పర్యటనకు ఇదీ కారణం..: ఇటీవల ఆర్జీయూకేటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కలుషిత ఆహారం ఘటనకు సంబంధించిన బాధ్యులపై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. ఆర్జీయూకేటీలోని మెస్‌లు ఇ1, ఇ2 ముందు విద్యార్థుల నిరసన వ్యక్తం చేశారు. రాత్రి భోజనం చేయకుండా విద్యార్థులు ఆందోళనకు దిగారు.
కలుషిత ఆహారం ఘటన తర్వాత.. మూడు మెస్‌ల కాంట్రాక్టులను రద్దు చేస్తామని వైస్ ఛాన్సలర్ హామీ ఇచ్చారని విద్యార్థులు తెలిపారు. కానీ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించిన స్టూడెంట్ వెల్ఫేర్‌కు చెందిన సిబ్బంది త్వరలో రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ వారు రాజీనామాలు చేయలేదని ప్రశ్నించారు. కలుషిత ఆహారంకు సంబంధించిన పదార్థాల నమూనాలను పరీక్షలకు పంపించారు.. కానీ ఆ నివేదికలోని విషయాలను ఎందుకు బహిరంగ పరచడం లేదో చెప్పాలన్నారు. జూలై 24 నాటికి మెస్‌ల కోసం కొత్త టెండర్లు పిలుస్తామని అధికారులు చెప్పారు.. అయినా ఈ విషయంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని విద్యార్థులు ప్రశ్నించారు
ఇవీ చదవండి: ఆర్జీయూకేటీలో మళ్లీ విద్యార్థుల ఆందోళన.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్