అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. చాలాచోట్ల చిరుజల్లులు.... కొన్నిచోట్ల మోస్తరు వానలు పడుతున్నాయి. జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.... చెరువులు అలుగులు దూకుతున్నాయి. జోరు వానలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.
పెద్దపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి (Ellampalli project) జలాశయానికి, పార్వతీ బ్యారేజ్‌కు వరద పోటెత్తుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 87,440 క్యూసెక్కులు ఉండగా.. 16 గేట్లు ఎత్తి 87,440 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 20 టీఎంసీలు కాగా... ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 19.73 టీఎంసీలుగా ఉంది.
నిండుకుండగా పార్వతీ బ్యారేజ్
పార్వతీ బ్యారేజ్ వరద ప్రవాహంతో నిండుకుండగా కళకళలాడుతోంది. ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు విడుదల చేయడంతో.. భారీగా వరద నీరు పార్వతీ బ్యారేజ్‌లోకి వచ్చిచేరింది. 74 గేట్లకు గాను.. ఈ సీజన్‌లో మొదటిసారిగా 60 గేట్లు ఎత్తి 56వేల 560 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 56వేల 560 క్యూసెక్కులు ఉంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వరద నీటి ప్రవాహం పెరిగింది. పై నుంచి వస్తున్న నీటిని యధావిధిగా పార్వతి బ్యారేజ్ గేట్లను ఎత్తి గోదావరిలోకి వదులుతున్నారు. దిగువన గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను పోలీసు అధికారులు అప్రమత్తం చేశారు. పార్వతీ బ్యారేజ్ పూర్తి నీటినిల్వ 8.83 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ 7.102 టీఎంసీలుగా ఉంది.
కడెం నుంచి గోదావరి పరవళ్లు
నిర్మల్ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు (Reservoirs) నిండిపోయాయి. వాటి ద్వారా వదిలిన నీటితో వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. జిల్లాలోని కడెం జలాశయానికి (kadem project)వరద ప్రవాహం ( Flood flow ) కొనసాగుతోంది. జలాశయానికి ఏకధాటిగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీనితో అధికారులు 5 గేట్లు తెరిచి దిగువకు నీటిని వదిలారు.
జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు(7.603 టీఎంసీలు) (TMC) కాగా... 695.950 అడుగులు(6.586 టీఎంసీలు) (TMC) స్థిరంగా ఉంచుతున్నారు. 32,119 క్యూసెక్యుల వరద నీరు ఇన్‌ఫ్లో ఉండగా... 5 గేట్ల ద్వారా 32,279 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జలాశయాలు జలకళను సంతరించుకోవడంతో మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాల రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
ఇవీ చూడండి: