నిర్మల్ జిల్లాలో 65 శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉన్న జల వనరులపై ఆధారపడి ఏటా 4.20 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, సోయాబిన్, పసుపు, పత్తి, మిర్చి, కందులు, తదితర పంటలను సాగు చేస్తున్నారు.
జిల్లాలో 19 మండలాలుండగా, 79 వ్యవసాయ క్లస్టర్లున్నాయి. వీటి పరిధిలో 17 మంది మండల వ్యవసాయాధికారులు, 74 మంది వ్యవసాయ విస్తరణాధికారులు విధులు నిర్వహిస్తున్నారు.
పరిపాలన సౌలభ్యం కోసం, రైతులకు పూర్తి స్థాయిలో సేవలందించేందుకు ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదిక భవనాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒక్కోచోట అర ఎకరం (20 గుంటలు) స్థలం అవసరం కావడంతో అన్ని ప్రాంతాల్లో భూముల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది.
ఇప్పటికే 62 క్లస్టర్లలో భూములు గుర్తించగా.. మిగతా 17 వాటిల్లో భూములను గుర్తించే పనిలో వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు.
అందనున్న సేవలు
రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు జిల్లావ్యాప్తంగా ఏవోలు, ఏఈవోలు అందుబాటులో ఉన్నా.. ఇదివరకు క్లస్టర్లు లేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. గ్రామాల వారీగా రైతు సమన్వయ సమితు (రైసస)లను ఏర్పాటు చేసినా.. ఏదైనా కార్యక్రమం నిర్వహణకు, సమావేశాల జరిపేందుకు ఆయా గ్రామాల్లో ఉన్న గ్రామపంచాయతీలు, లేదా ఇతరత్రా ప్రైవేటు భవనాల్లో నిర్వహించే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు ప్రభుత్వం అన్ని హంగులతో రైతు వేదిక భవనాల నిర్మాణాలకు చర్యలు చేపట్టింది. ఏఈవో కార్యాలయం, సమావేశ మందిరం, గోదాం, భూసార పరీక్షల కోసం ప్రత్యేక గది వంటి అత్యాధునిక హంగులతో ఒక్కో భవనాన్ని నిర్మించనున్నారు. మండల కేంద్రాలు ఉన్న క్లస్టర్లలో అదనంగా ఏవో కార్యాలయం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
భవనాలు అందుబాటులోకి వస్తే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సదరు క్లస్టర్లలో నిల్వ చేసుకునే వీలుండడంతో పాటు అధికారులు, భూసార పరీక్షా కేంద్రం వంటివి అందుబాటులోకి వచ్చి సమస్యలు తీరనున్నాయి. ఈ రైతు వేదిక భవనాల్లో అన్నదాతలకు పంట సమగ్ర విధానంపై శిక్షణనిస్తూ అధిక దిగుబడులు సాధించేలా చర్యలు తీసుకోనున్నారు.
ఆధునిక సాగు పద్ధతులు, చీడపీడల నివారణ, మేలురక విత్తనాల ఎంపిక, తయారీ, సాగు మెలకువలతో అధిక దిగుబడులు సాధించడం, గిట్టుబాటు ధరలు పొందేలా వ్యవసాయశాఖ, అనుబంధ విభాగాల నుంచి ఎప్పటికప్పుడు సూచనలు అందనున్నాయి. రైతు వేదికల నిర్మాణాలు పూర్తయితే అన్నదాతలకు అన్ని రకాలుగా వ్యవ‘సాయం’ అందనుంది.
మండలాల వారీగా వ్యవసాయ కార్డులు
మండలాల్లోని గ్రామాల్లో నేల స్వభావం, సాగునీటి లభ్యత, పంటల సాగు విస్తీర్ణం ఆధారంగా ఏ గ్రామంలో ఏయే రకాల పంటలు సాగు చేయొచ్ఛు ఆయా పంటకు సంబంధించి సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు.
మండలాల వారీగా వ్యవసాయ కార్డులు రూపొందించి పంటల మార్పిడికి అనుగుణంగా సాగు చేసేలా పంటల వివరాలు నమోదు చేయనున్నారు.