బాలల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని డీఎస్పీ ఉపేందర్ రెడ్డి అన్నారు. నిర్మల్ గ్రామీణ ఠాణాలో సోమవారం ఆపరేషన్ స్మైల్లో భాగంగా చిన్నారులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆపరేషన్ స్మైల్ ఏడో విడత కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 238 మంది బాలలను గుర్తించినట్లు తెలిపారు.
వారిలో 159 మంది బాలురు, 79 మంది బాలికలు ఉన్నట్లు వివరించారు. మహారాష్ట్రకు చెందిన 113, ఒడిశాకు చెంది 37, మధ్యప్రదేశ్ 1, ఏపీకి చెందిన 10 మంది ఉన్నారు. వారిని పాఠశాలలో చేర్పించేందుకు తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చామన్నారు. సమావేశంలో నిర్మల్ గ్రామీణ సీఐ వెంకటేష్, ఎస్సై మిథున్ చక్రవర్తి, జిల్లా బాలల సంరక్షణ అధికారి మురళి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రూ. 5 భోజనం చేసిన మున్సిపల్ కమిషనర్