Dilawarpur Villagers Protest Over Constructing Ethanol Industry : నిర్మల్ జిల్లా దిలావార్ పూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలని కొన్నాళ్లుగా గ్రామస్థులు పోరాటం చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వం నుంచి స్పందన కొరవడడంతో ఆందోళన తీవ్రతరం అయ్యింది. పరిశ్రమను ఇప్పటికైనా నిలిపివేయకుంటే నిరంతర ఆందోళన చేపడతామని స్థానిక రైతులు హెచ్చరిస్తున్నారు.
దిలావార్ పూర్‌లో నిర్మిస్తున్న ఇథనాల్(Ethanol) పరిశ్రమ నిర్మాణంను ఆపాలంటూ గ్రామస్థులు, రైతులు నిర్మాణంలో ఉన్న ప్రహారి గోడను కూల్చివేశారు. పలు వాహనాలు ధ్వంసం చేసి నిప్పటించారు. తాజాగా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన వంటావార్పు చేపట్టి నిరసన చేపట్టారు. పరిస్థితులు చేజారకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
రాత్రి పూట కరెంట్ కట్ చేస్తున్నారు: సింగరేణి భూనిర్వాసితుల ఆందోళన
"అన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చి ఎవరికీ తెలియకుండా భూమిని సమీకరించి ఇథనాల్ ఫ్యాక్టరీని కడుతున్నారు. దిలావార్ పూర్ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అందరం కలిసి గత మూడు, నాలుగు నెలలుగా నిరసన దీక్షలు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రావడం లేదు. నిన్న ఫ్యాక్టరీ ముట్టడి కార్యక్రమంలో పదివేల రైతులు, ప్రజలు అందరం కలిసి ఫ్యాక్టరీ వద్దకు వెళ్లాము. పోలీసు లాఠీఛార్జీకు నిరసనగా ఈరోజు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టాము. దిలావార్ పూర్ మండలం ప్రజలంతా సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ప్రభుత్వం ఇక్కడి నుంచి ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలి. లేకపోతే నిరసనలను ఉద్ధృతం చేస్తాం." - రైతు
Ethanol Industry Constructing in Nirmal : ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం వల్ల ఒకవైపు రైతులు, గ్రామస్థులు నష్టపోవడంతో పాటు శ్రీరాం సాగర్ బ్యాక్ వాటర్ కలుషితం అవుతున్నాయని బాధిత గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తు తరాలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. తమ అభ్యంతరాలు స్వీకరించకుండానే పరిశ్రమ నిర్మాణానికి అనుమతులు ఎలా వచ్చాయో తెలియడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచించి పరిశ్రమను రద్దు చేయాలని కన్నీరు పెట్టుకుంటున్నారు.
ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుతో భవిష్యత్తులో తమకు పూర్తిగా అంధకారమేనని స్థానిక ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకొని వీలైనంత త్వరగా పరిశ్రమను నిలిపేయాలంటూ ఆందోళనలను తీవ్రతరం చేశారు. లేకపోతే పరిశ్రమ మూసే వరకు తమ పోరాటాలను ఉద్ధృతం చేస్తామని చెప్పారు.