నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బురుడు గల్లీకి చెందిన పలు కుటుంబాలు మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించాయి. గతంలో కుబీర్ బైపాస్ రోడ్డులో తమ ఇళ్లు పోవటంతో అప్పటి నాయకులు, అధికారులు బాధితులకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీతో అక్కడి నుంచి వచ్చి అద్దెకుంటున్నామని బాధితులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తమకు ఇళ్లు కట్టివ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి రెండు పడక గదుల ఇండ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. అధికారులు లేదా నాయకులు వచ్చి హామీ ఇచ్చే వరకు కార్యాలయంలోనే ఉంటామని స్పష్టం చేశారు.
దొంగ పట్టాలిచ్చారు..
పోలీసులు వచ్చి బాధితులకు నచ్చ చెప్పినా వారు వినకుండా కార్యాలయంలో అలాగే కూర్చున్నారు. డిగ్రీ కళాశాల వద్ద ఉన్న స్థలంలో తమకు దొంగ పట్టాలు ఇచ్చారని బాధితులు ఆరోపించారు. ఎమ్మెల్యే, కలెక్టర్ వచ్చి పలుమార్లు చూసినా.. తమకు న్యాయం జరగలేదని వాపోయారు.
నిధులు మళ్లించారు..
బాధితులకు నిర్మల్ జిల్లా భాజపా అధ్యక్షురాలు రమాదేవి మద్దతు తెలిపారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని చెప్పి 7ఏళ్ల నుంచి మభ్యపెడుతున్నారని ఆమె ఆరోపించారు. కేంద్రం డబ్బులు పంపిస్తే ఆ నిధులను మళ్లించారని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: దొంగ మిత్రులు.. పోలీసులకు దొరికారు