నిర్మల్ జిల్లాలో రూర్బన్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డీఆర్డీవో ఆధ్వర్యంలో రూర్బన్ పథకం అమలుపై సమీక్షించారు.

పట్టణ ప్రాంతాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం రూర్బన్ పథకం ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో పథకం అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలతో పాటు గ్రామాల రూపురేఖలు మార్చే దిశగా అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
ఇప్పటికే కుంటాల మండలంలోని 15గ్రామ పంచాయతీల్లో 57 పనులు పూర్తయ్యాయని, 11 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. త్వరలోనే వివిధ 55 పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ముషర్రఫ్ సూచించారు. క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు.
ఇదీ చదవండి: "గ్రామీణ భారత అభివృద్ధే.. రూర్బన్ మిషన్ పథకం లక్ష్యం"