నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మర్లగొండ తండాలో నిన్న రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్ర కలకలం సృష్టించింది. పాత కక్షల కారణంగా కారోబార్ కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులపై ఎంపీటీసీ సహా ఆయన వర్గీయులు దాడి చేశారు. కారోబారితో మరో ఐదుగురుకి గాయాలు కావడంతో క్షతగాత్రులను భైంసా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే సర్పంచ్ వర్గీయులు... పోలీసుల వద్ద న్యాయం జరగడం లేదని కలెక్టర్‌ను కలవడానికి బస్‌లో వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ సర్పంచ్ వర్గీయులు వినకుండా సదాశివనగర్ తండా వరకు నడుచుకుంటూ వచ్చారు. అక్కడికి చేరుకున్న డీఎస్పీ నర్సింగ్ రావు నచ్చ చెప్పడంతో సదాశివ్ నగర్ తండాలోనే సర్పంచ్ వర్గీయులు ఉండిపోయారు.
తమపై ఎంపీటీసీ వర్గీయులు నిన్న రాత్రి దాడి చేయడంతో ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్దామని బయలుదేరే సమయంలో పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. తమకు న్యాయం చేస్తామని చెప్పి... ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేయలేదని వాపోయారు.
నిన్న రాత్రి మర్లగొండ తండాలో జరిగిన ఇరువర్గాల మధ్య ఘర్షణలో ఓ వర్గానికి చెందిన వారికి గాయాలు కావడంతో భైంసా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు డీఎస్పీ నర్సింగ్‌రావు తెలిపారు. దీనికి సంబంధించిన కేసు కబీర్ పోలీస్ స్టేషన్లో నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఉన్నవారిని అరెస్ట్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సంబంధిత కథనం: కారుకు సైకిల్ అడ్డుందని ఘర్షణ.. కర్రలతో ఇరువర్గాల దాడి