రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన వారందరికి డబుల్ బెడ్ రూమ్ గృహాలను నిర్మించి ఇస్తామని... నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ వైస్ ఛైర్మన్ జాబీర్ హైమాద్ హామీ ఇచ్చారు. పట్టణంలోని బురుడు గల్లీకి చెందిన పలు కుటుంబాలు గతంలో కుబీర్ బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఇళ్లను కోల్పోయారు. త్వరలోనే పక్క గృహాలు కట్టిస్తామని అప్పటి అధికారులు, నాయకులు హామీ ఇచ్చారు. ఇప్పటికీ నిర్మాణాలు ప్రారంభించకపోవడంతో 2రోజుల నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ జాబీర్ హైమాద్ కార్యాలయానికి చేరుకుని బాధితులతో చర్చించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఆర్అండ్బీ శాఖ ఆదేశాలతో టెండర్ ద్వారా నిర్మాణాలు జరుగుతాయని చెప్పారు. వచ్చే రెండు రోజుల్లో మరోసారి టెండర్ ప్రక్రియ ఉందని అన్నారు. అందులో ఎవరు ముందుకు రాకుంటే దాన్ని మున్సిపాలిటీకి అప్పజెప్పాలని కోరుతామన్నారు.
ఇదీ చదవండి: అంగడిపేట ప్రమాద ఘటనలో మరొకరు మృతి