బాసరలోని రాజీవ్‌గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) చట్టంలో కీలక మార్పు చేయనున్నారు. గవర్నరే కులపతిగా వ్యవహరించేలా చట్టాన్ని మార్చనున్నారు. విద్యాశాఖ పరిధిలో మొత్తం 11 విశ్వవిద్యాలయాలుండగా పదింటికి కులపతిగా గవర్నర్ ఉంటారు. బాసర యూనివర్శిటీకి మాత్రం విద్యావేత్త ఉండేలా 2008లో ఉమ్మడి ఏపీలో చట్టం తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన వరకు ప్రవాసాంధ్రుడు, కంప్యూటర్ సైన్స్ నిపుణుడు ఆచార్య రాజిరెడ్డి కులపతిగా వ్యవహరించారు. తర్వాత నుంచి ఇక్కడ కులపతి లేరు.
ఒక్కో వర్సిటీకి ఒక్కో చట్టం కాకుండా ఒకే చట్టం ఉండాలని భావించి ఓయూ మాజీ ఉపకులపతి ఆచార్య సిద్ధికీ, ఓయూ న్యాయ విభాగం ఆచార్యుడు జీబీరెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ గోపాలరెడ్డితో కొద్ది నెలల క్రితం ఉన్నత విద్యామండలి నియమించిన కమిటీ బాసర వర్సిటీ విషయమై కూడా చర్చించింది. వారం రోజుల్లో ఉన్నత విద్యామండలికి నివేదిక ఇవ్వనుంది. చట్టంలో మార్పు చేయాల్సి ఉన్నందునే ఆర్‌జీయూకేటీకి ఉపకులపతిని నియమించడం వీలు కావడం లేదు. ఉపకులపతిని నియమించాలంటే కులపతి ఉండాలి. చట్టంలో మార్పుపై కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దానికి ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది.
ఇదీ చూడండి : జనగామలో 130.3కిలోల గంజాయి పట్టివేత