నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆదివారం నుంచి జరగనున్న వేడుకలకు ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించిన కరపత్రాలను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఇతర ప్రముఖులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. బాసర ఆలయంలో క్యూలైన్లు, ప్రత్యేక ధరలతో అక్షరాభ్యాస మండపాల ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
మూడు రోజులు పాటు ఉత్సవాలు :
రేపటి నుంచి మూడు రోజుల పాటు వసంత పంచమి ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఆదివారం ఉదయం నాలుగు గంటలకు అమ్మవారిని సుప్రభాత సేవ, గణపతి పూజ, మంగళ వాయిద్యా సేవ, ప్రత్యేక మహాభిషేకం పూజలతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. రెండో రోజు సోమవారం సుప్రభాత అభిషేకం, దేవత హోమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మంగళవారం వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు, ఉదయం చండీ మహావిద్యా హోమం, బలిదానం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం వసంత పంచమి ఉత్సవాలు ముగియనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి : సభ్యత్వ నమోదులోనూ సిద్దిపేట ముందుండాలి: హరీశ్‌రావు