నిర్మల్ జిల్లాలోని వ్యవసాయ విస్తరణాధికారులు తమ క్లస్టర్ పరిధిలోని గ్రామాలకు వెళ్తూ రైతుబంధు సభ్యులతో కలసి సర్వే చేస్తున్నారు. జిల్లాలో 79 క్లస్టర్ల పరిధిలో 19 మండలాల్లోని 396 పంచాయతీల్లో ఈ సర్వే జరుగుతోంది. అనంతరం పూర్తి వివరాలు తమ వద్ద ఉన్న ట్యాబ్‌లో నమోదు చేస్తున్నారు. ఈ సర్వేతో జిల్లాలోని క్లస్టర్లు, మండలాల వారీగా ఎంత విస్తీర్ణంలో ఏయే పంటలు సాగు అవుతున్నాయో లెక్క తేలనుంది. దీని ప్రకారం ఆ పంట దిగుబడిపై ఒక అంచనాకు రానున్నారు. ఈ ప్రకారం పంట కొనుగోలు సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తారు.
పంట దిగుబడిని మార్కెట్లో అమ్మడానికి దళారుల ప్రమేయాన్ని నివారించడానికి అనువుగా ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఏటా వానాకాలంలో అయితే జిల్లాలో యేటా ఖరీఫ్‌లో సాధారణ పంటల విస్తీర్ణం 3,67,550 ఎకరాలు ఉండగా.. ఈసారి 4,21,606 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందంటూ వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం వరి 1.03 లక్షలు, పత్తి 1.74 లక్షలు, సోయాబిన్ 85 వేలు, కందులు 44,250, మినుములు 5,500, పెసర్లు 2 వేలు, ఇతర పంటలు 7,856 ఎకరాల్లో సాగు అవుతాయని ప్రణాళికలు వేశారు.
10వ తేదీ వరకు పూర్తిచేస్తాం
- అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి
జిల్లాలోని 79 క్లస్టర్ల పరిధిలో పంట లెక్కలు ప్రక్రియ తుది దశకు చేరింది. ఈ నెల 10 వరకు ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారో పక్కా లెక్కలు తేలనున్నాయి. పత్తి, సోయా పంటల లెక్క 90 శాతం, వరి పంట 70 శాతం పూర్తయింది. వీటితో పాటు ఇతర పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. మిగిలిన రైతులు పంటల సాగుకు సంబంధించి వివరాలు వ్యవసాయ అధికారులు అందించాలి. సర్వే నెంబర్ల ఆధారంగా ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు సాగు చేశారో నమోదు చేసుకోవాలి. జాబితాలో పేర్లు ఉంటే పంట ఉత్పత్తులు విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.