Disha Accused Encounter Case Updates : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిర్పూర్కర్ కమిషన్ నివేదిక, సుప్రీం ఆదేశాలపై.... ఎన్‌కౌంటర్‌లో హతమైన నిందితుల కుటుంబీకులు స్పందించారు. తమ పిల్లలు చేసింది నేరమైతే కోర్టులో విచారించి శిక్షించాలే తప్ప... ఎన్‌కౌంటర్ చేయడం నేరమని... తాము గతంలో కమిషన్ ముందు చెప్పినట్లు... దిశ కేసులో నిందితుడు జొల్లు శివ తండ్రి కురుమయ్య గుర్తు చేశారు. ప్రస్తుతం కమిషన్ కూడా ఎన్‌కౌంటర్ బూటకమని అభిప్రాయపడిందన్నారు. కన్నబిడ్డల్ని కోల్పోయిన తమకు హైకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు.
సుప్రీం ఆదేశాలు, కమిషన్ నివేదిక ద్వారా తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు చెన్నకేశవులు తల్లి జయమ్మ అభిప్రాయపడ్డారు. ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులను శిక్షించాలని దిశ కేసులో ఏ1 నిందితుడు మహ్మద్ ఆరీఫ్ తండ్రి హుస్సేన్ డిమాండ్ చేశారు.
"మా బిడ్డలు తప్పు చేస్తే శిక్షించాలి కానీ ఎన్‌కౌంటర్ చేయడమేంటని గతంలో పోలీసులను అడిగాం. కానీ అప్పుడు వాళ్లు.. తమపై ఎదురుకాల్పులు జరిపితేనే కాల్చాల్సి వచ్చిందని చెప్పారు. సిర్పూర్కర్ కమిషన్ ఎదుట మేం జరిగింది చెప్పాం. కన్నబిడ్డల్ని పోగొట్టుకున్న మాకు హైకోర్టులో న్యాయం జరుగుతుందనుకుంటున్నాం. మా పిల్లలను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు శిక్ష పడాలి." -- ఎన్‌కౌంటర్‌లో హతమైన దిశ నిందితుల కుటుంబ సభ్యులు