KTR narayanpet tour: సీఎం కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 11 లక్షల ఎకరాలకు నీరు అందించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. "రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు ఇస్తున్న ప్రభుత్వం ఇది. మోదీ సర్కార్ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే తేల్చటం లేదు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వట్లేదు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరుతూ బీజేపీ రాష్ట్ర శాఖ తీర్మానం చేయాలి. రూ.400 గ్యాస్ ధరను రూ.1200 చేసిన ప్రధాని దేవుడా? రూ.70 ఉన్న పెట్రోల్ ధరను రూ.110 చేసిన ప్రధాని దేవుడా?" అని కేటీఆర్ ప్రశ్నించారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పేట మండలం సింగారం వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో మొత్తం రూ.184.42 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
కేటీఆర్ వెంట మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాఠోడ్, శ్రీనివాస్ గౌడ్‌లు ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం కేటీఆర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో కేటీఆర్ శ్రీకారం చుట్టిన అభివృద్ధి పనుల వివరాలు
- రూ.62.10 కోట్లతో సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం
- రూ.38.50 కోట్లతో ఎస్పీ కార్యాలయ భవనం
- రూ.6 కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్ భవన ప్రారంభోత్సవం
- రూ.57 లక్షలతో నిర్మించిన సఖి భవన ప్రారంభోత్సవం
- రూ.4 కోట్లతో అభివృద్ధి చేసిన కొండారెడ్డిపల్లి మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం
- రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ పార్క్ ప్రారంభోత్సవం
- రూ. కోటిలతో దోభీ ఘాట్ నిర్మాణానికి శంకుస్థాపన
- సేవాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
- అప్పంపల్లి నుంచి కోయిలకొండ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
- నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన
- ధన్వాడ మండల తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన
- మరికల్ మండల కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన