నారాయణపేట జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు, కుంటలు నిండి ప్రవహిస్తున్నాయి. అందువల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డా. చేతన తెలిపారు. జిల్లాలోని పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమన్వయంతో కలిసి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణాల్లో, గ్రామాల్లో మట్టితో కట్టిన పురాతన ఇళ్ల గురించి సమాచారం తెలుసుకుని ప్రమాదంలో ఉంటే సంబంధిత మున్సిపల్, రెవిన్యూ అధికారుల సహకారంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
ప్రజలకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని ప్రజలెవ్వరూ చేపల వేటకు, నీటి ప్రవాహం చూడడానికి, ఫొటోలు దిగడానికి వెళ్లరాదని పేర్కొన్నారు. బ్లూ కోట్స్, పెట్రోల్ కార్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డయల్ 100 కాల్స్ కి వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రజలు భారీ వర్షాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా డయల్ 100కి కాల్ చేసి పోలీసువారికి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
ఇదీ చూడండి: భారీగా వరదనీరు చేరి నిండుకుండలా మారిన హిమాయత్‌సాగర్