నాగులపంచమి వేళ అంతటా పుట్ట వద్ద పూజలు, పాలు పోసి నాగదేవతలు పూజిస్తుంటారు. కానీ నారాయణపేట జిల్లా కందుకూర్‌లో మాత్రం అందుకు భిన్నంగా పండుగ జరుగుతోంది. ఇక్కడి ప్రజలు పాములకు బదులు తేళ్ల పంచమి నిర్వహిస్తున్నారు. గ్రామ శివారులోని కొండపై తేళ్ల దేవత ఆలయం నిర్మించి..... విగ్రహాలకు పాలు పోసి తేళ్ల పంచమి నిర్వహిస్తున్నారు. తేళ్లను చేతిలోకి తీసుకుని ఆటలాడుతున్నారు. ఒకవేళ తేలు కుట్టినా ఆలయంలోని విభూతి రాస్తే తగ్గిపోతుందని ఇక్కడి ప్రజల విశ్వసిస్తున్నారు.
తేళ్ల దేవత ఆలయం నారాయణపేట పట్టణానికి 25 కిలో మీటర్ల దూరంలో కందుకూరు గ్రామ శివారులోని కొండమవ్వ గుట్టపై ఉంది. గుట్టపై ఉన్న ఏ రాయిని తీసినా తేళ్లు ప్రత్యక్షమవుతాయి. నాగుల పంచమి రోజున పిల్లలు, పెద్దలు తేళ్ల గుట్టపైకి వెళ్లి... ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం రాళ్ల కింద ఉన్న తేళ్లను ముట్టుకుంటారు. ఈ సందర్భంగా అవి ఎలాంటి హాని చేయవని వారి నమ్మకం. ఒకవేళ తేలు కుట్టినా ఆలయంలోని విభూతిని రాస్తే తగ్గిపోతుందని విశ్వసిస్తుంటారు. ఏటా నాగుల పంచమి రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని అనుమతించడం లేదని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా నాగుల పంచమి వేడుకలు