వినూత్న ఒరవడి సృష్టించేందుకు విద్యార్థి దశ నుంచే శాస్త్ర సాంకేతికతపై ప్రోత్సాహం కల్పించాలనే ప్రేరణ విద్యాధికారులు, ఉపాధ్యాయుల్లో కొరవడిందని చెప్పవచ్చు. నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 866 ఉంటే 13 పాఠశాలలు మాత్రమే ఇన్‌స్పైర్ అవార్డులకు దరఖాస్తు చేశారు. విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో విద్యార్థులు ప్రయోగాలబాట పట్టలేకపోతున్నారు.
దరఖాస్తు చేసింది 13 పాఠశాలలే
నారాయణపేట జిల్లాలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 325 , మహబూబ్‌నగర్ జిల్లాలో 541 ఉన్నాయి. రెండు జిల్లాలో ‘ఇన్‌స్పైర్ మనక్’కు 13 పాఠశాలలు మాత్రమే దరఖాస్తు చేశాయి. ఈ రెండు జిల్లాల్లో 853 పాఠశాలలు అంతర్జాలంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. వరుస ఎన్నికలతో ఉపాధ్యాయులు తీరిక లేకుండా విధుల్లో పాల్గొనడంతో పట్టించుకోలేదని పలువురు పేర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఇక 24 రోజులే మిగిలాయి. పాఠశాలలు పున:ప్రారంభమై నెల కావస్తున్నా ఉపాధ్యాయులను ‘ఇన్‌స్పైర్’ చేయడం, అవగాహన కల్పించడం, పర్యవేక్షించడం విద్యాశాఖ అధికారులు మరిచిపోయినట్లు ఉన్నారని పలువురు విమర్శిస్తున్నారు.
జులై నెల 31 వరకు
భవిష్యత్తులో శాస్త్రవేత్తగా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది విద్యార్థులకు సైన్స్ రంగంపై అవగాహన కల్పించి ప్రేరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ‘ఇన్‌స్పైర్ మనక్’ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. మూడు నెలల కిందట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. దరఖాస్తులకు జులై నెల 31 వరకు గడువుంది. పాఠశాల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ చిట్టి బుర్రలకు పదును పెట్టి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది.
చిట్టిబుర్రలకు పదును పెట్టాలి
చిట్టి బుర్రలకు పదును పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యార్థులను ప్రయోగాల బాట పట్టించాలని కేంద్రం ప్రోత్సాహం అందిస్తున్నప్పుడు ప్రతి పాఠశాల ఈ కార్యక్రమంలో భాగస్వాములుకావాలి. విద్యార్థులకు కల్పించిన మంచి అవకాశం చేజారిపోయేలా ఉంది. సమయం దగ్గర పడుతున్నా ఉపాధ్యాయులు, అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు. దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికీ సమయం మించిపోలేదు. జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికైన మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకుంటే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఇదీ చూడండి : 'ఊరి బడికి ప్రవాసుడి అండ'