భూదస్త్రాల నిర్వాహణలో అధికారుల నిర్వాకం రైతుల కొంపముంచింది. ఇన్నేళ్లుగా అందుతున్న రైతుబంధు, పంట రుణాలు సహా యాజమాన్య హక్కుల్ని రైతులు కోల్పోవాల్సి వచ్చింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలకేంద్రం నుంచి దామరగిద్దతండా, బాపన్‌పల్లి, సజనాపూర్, మద్దెలబీడు, యానగొంది రహదారుల్లో గతంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం రైతుల నుంచి సేకరించిన భూముల్ని... ఎలాంటి సమచారం లేకుండానే వారి ఖాతాల నుంచి అధికారులు తొలగించారు. ఇది పోగా మిగిలిన భూమి రైతు పేరిటే ఉండాలి. కానీ.. అధికారుల నిర్వాకంతో ఆయా సర్వే నెంబర్‌లలో ఉన్న మొత్తం భూములు ఆన్‌లైన్‌లో కనిపించకుండా పోయాయి. దీంతో ఇన్నేళ్లుగా అందిన రైతుబంధు ఒక్కసారిగా ఆగిపోయింది. బ్యాంకులో రుణం కోసం ఆన్ లైన్ పహానీలో వీరి భూములు కనిపించడం లేదు.
అనుమానాలు..ఆరోపణలు
సేకరించిన భూముల్ని రైతుల ఖాతాల్లోంచి తొలగించే విషయంలోనూ అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. రోడ్డుకిరువైపులా సేకరించిన అందరి రైతుల భూముల్ని రికార్డుల్లోంచి తొలగించినట్లయితే... 400మందికి పైగా తమ భూములను కోల్పోవాల్సి ఉంటుంది. కానీ వీరిలో కొందరివి మాత్రమే తొలగించి.. మిగిలిన భూముల జోలికే వెళ్లకపోవడం విమర్శలకు దారితీస్తోంది. రోడ్డుకు ఆనుకుని పదెకరాలున్న వాళ్లకూ.. గుంట భూమిని తొలగించి.. ఒక్కెకరమున్న రైతుకూ రెండు,మూడు గుంటల భూమిని తొలగించడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారానికి అధికారులు తెరలేపారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
వారే కారణం
ముందస్తు సమాచారం లేకుండానే రికార్డుల్లోంచి భూమిని తొలగించడం, ఉన్న భూములు ఆన్‌లైన్‌లో కనిపించకుండాపోవడమే కాదు... జరిగిన అన్యాయాన్ని అధికారులు పట్టించుకోకపోవటంపై రైతులు భగ్గుమంటున్నారు. ఈ తప్పిదాలకు రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే కొంతమంది సిబ్బందే కారణమని ఆరోపిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమ భూములు గతంలో ఉన్న మాదిరిగానే సర్వే నెంబర్‌లోనే ఆన్‌లైన్ లో నిక్షిప్తం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
న్యాయం చేస్తాం..
ఈ వ్యవహారంపై దామరగిద్ద తహశీల్దార్, నారాయణపేట ఆర్డీఓను వివరణ కోరగా.... ధరణిలో సవరణల విభాగంలో 'మిస్సింగ్ సర్వేనెంబర్ ఎక్టెంట్' కింద బాధితుల వివరాలను కలెక్టర్‌కు సమర్పించామని చెప్పారు. కలెక్టర్ ఆమోదం తర్వాత రైతుల భూములు వారి పేర్ల మీద ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తామని తెలిపారు.
- ఇదీ చూడండి : అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు ఈడీ కోర్టు బెయిల్ నిరాకరణ