నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్‌లో అధికారులు పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ మేరకు 167వ జాతీయ రహదారి మాగనూర్ పెద్ద వాగుపై నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుండటం వల్ల హైదరాబాద్ నుంచి రాయచూర్‌కు మధ్య కిలోమీటర్ మేర రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపై జోరుగా ప్రవహిస్తున్న వరదనీటి ఉద్ధృతి తగ్గాక రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ హరిచందన తెలిపారు.
శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగుల్లోకి వరద నీరు వస్తుండగా మక్తల్ మండలంలోని పలు గ్రామాలను కలెక్టర్ హరిచందన పరిశీలించారు. జాతీయ రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. వాగులోకి ఎవరు ప్రవేశించకుండా పోలీస్ సిబ్బందిని కాపలాగా ఉంచాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పరువు హత్య: సినీ ఫక్కీలో అల్లుని హత్య... మామతో సహా 14 మంది కటకటాల్లోకి...