కోట్లాది రూపాయల వ్యయంతో అత్యాధునిక వసతులతో పట్టణవాసులకు ఆహ్లాదం పంచాల్సిన మినీ ట్యాంక్‌బండ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 3.69 కోట్ల నిధులతో పూర్తి చేయాల్సిన మినీ ట్యాంక్‌బండ్ పనులు.. రెండున్నరేళ్లు అవుతున్న... 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. నెలకో రాయి వేసి, కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి బిల్లులు వసూలు చేస్తున్నారు. బతుకమ్మ పండుగ సమీపిస్తున్నా... వారిలో చలనం లేదు. ఈ ఏడాది కూడా మక్తల్ వాసులకు మినీ ట్యాంక్‌బండ్ అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
చేయాల్సిన పనులు
మినీట్యాంక్‌బండ్ నిర్మాణంలో భాగంగా... 6.25 మీటర్ల వెడల్పు గల ఆనకట్ట, తూములు, అలుగులతో పాటు కాలువల మరమ్మత్తులు, ఆనకట్ట రీలింగ్,రివింట్మెంట్, కట్టపై మెటల్ రోడ్డు నిర్మాణం, కట్టపైకి వెళ్లడానికి ర్యాంపు నిర్మాణం, మినీ ట్యాంక్ బండ్ చుట్టూ రెండు మీటర్ల వెడల్పుతో వాకింగ్ ట్రాక్, టూరిస్టులకు బోటింగ్ వసతి, పార్కింగ్ స్థలం, ఆనకట్టపై కుర్చీలు, లైటింగ్ పనులు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
రైతుల ఆందోళన
మినీ ట్యాంక్‌బండ్‌పై తొలుత సీసీ రోడ్డు వేశారు. తర్వాత మెటల్ రోడ్డు వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ పనులు ప్రారంభించలేదు. చిన్న పాటి వర్షానికే ఆనకట్టపై ఉన్న మట్టి జారి రివింట్మెంట్లోని రాళ్లు చెరువులో పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇంకెప్పుడు
ఈ ఏడాదైనా... బతుకమ్మ పండుగకు అందుబాటులోకి వస్తుందనుకున్న మినీ ట్యాంక్ మక్తల్ వాసులకు నిరాశే మిగిల్చేలా ఉంది.