గొర్రెల సంపద పెరగడానికి ప్రభుత్వం ఉచిత గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చిందని రాష్ట్ర పశు వైద్య, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డా.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కురుమ, యాదవ వర్గాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని తెలిపారు. గురువారం నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని పెద్దచింతకుంట గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిరుపేద గొర్రెల కాపరులకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. రెండో విడత ఉచిత గొర్రెలు అందని వారికి త్వరలోనే అందిస్తామని వెల్లడించారు. ఈనెల 15 నుంచి ఆవులకు, గేదెలకు, వరాహాలకు గాలికుంటు నివారణ ముందులు పంపిణీ చేస్తామని తెలిపారు.