Illegal Land Registration: ప్రభుత్వ, అటవీ భూములకు పట్టాలు జారీ చేసిన వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పట్టాల జారీ వ్యవహారంపై సమగ్ర విచారణ నిర్వహించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ‘అక్రమాలకు పట్టా’ శీర్షికన ఈటీవీ భారత్‌లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్పందించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులు సమాచారం సేకరించారు. సంబంధిత తహసీల్దారు కార్యాలయాల నుంచి నివేదికలను కోరారు. దీంతో రెవెన్యూ అధికారులు ఖాస్రా పహానీలు, ధరణి పోర్టల్లోని సమాచారాన్ని పోల్చుకుని అర్హులు, అనర్హులను వేరేచేసే పనిలో నిమగ్నమయ్యారు.
బొమ్మన్‌పహాడ్‌లో విచారణ...
ఉన్నతాధికారుల ఆదేశంతో ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ దానయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది గురువారం నారాయణపేట జిల్లాలోని బొమ్మన్‌పహాడ్ గ్రామాన్ని సందర్శించారు. ఆయా సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిలో పట్టాలు కలిగిన రైతులను పంచాయతీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. రైతుల పేర్లను చదువుతూ ఎవరెవరు సాగు చేస్తున్నారు? ఎంతమేర అనే వివరాలను తెలుసుకున్నారు. రెండుమూడ్రోజుల్లో గ్రామంలో సర్వే నిర్వహించి పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. రైతులు సహకరించాలని సూచించారు. అనంతరం 225,110, 116, 117 సర్వే నంబర్లలోని ప్రభుత్వభూమిని సైతం పరిశీలించారు.
ఎసైన్డ్‌ను ఆసరాగా చేసుకుని..
నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఎసైన్డ్ భూములను లక్ష్యంగా చేసుకుని అక్రమానికి తెరతీశారు. మారుమూల మండలాలైన లింగాల, కొల్లాపూర్, కూడేరు ప్రాంతాల్లో 2017 సెప్టెంబరు తర్వాత కొత్త పట్టాలు జారీ అయ్యాయి. ఒక్కో ఎకరాకు పట్టా జారీకి కనీసం రూ.10వేల వరకు వసూలు చేశారు. కొందరు రెవెన్యూ అధికారులు, దళారుల ప్రమేయంతో రెండు నుంచి ఐదెకరాల వరకు పట్టాల్లో విస్తీర్ణాన్ని నమోదు చేశారు. లింగాల మండల శివారుల్లోని ఒక గుట్ట అటవీప్రాంతంలో ఉంది. దాని దిగువన 20 మందికి 1977లో ఎసైన్డ్ పట్టాలిచ్చారు. దాన్ని ఆసరాగా చేసుకుని కథ నడిపారు. ఆ సర్వే నంబరుకు ఉపసంఖ్యలు జోడించి వందల మందికి ఎసైన్డ్ కింద రాసిచ్చేశారు. పట్టాపాసుపుస్తకాలూ జారీ అయ్యాయి. ఈ మండలంలో పదికిపైగా రెవెన్యూ గ్రామాల్లో ఇలా పెద్దఎత్తున పట్టాలిచ్చారు. ఇక్కడ హీనపక్షం ఎకరా భూమి రూ.20 లక్షల ధర పలుకుతోంది. అంటే రూ.వందల కోట్ల విలువైన సర్కారు భూమి
అన్యాక్రాంతమైనట్లే లెక్క..
* లింగాల పరిధిలో 63, 191, 281, 360, 361, 436, 437, 488, 642, 793 సర్వే నంబర్లు, ఉప నంబర్లలో 5,937 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అనంతరం వాటికి మరికొన్ని ఉపసంఖ్యలు జోడించారు. దాదాపు 1200 ఎకరాలకు సంబంధించి 550 మందికి కొత్తగా పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. వీటిలో ముప్పావుభాగం లావూని పట్టాలు ఇచ్చారు. సర్వే నంబరు 63లో 260 ఎకరాల గుట్ట ఉండగా 40 మందికి పట్టాలు అందజేశారు. 576 సర్వే నంబరులో నెమ్మళ్లగుట్ట ఉండగా ఇందులోనూ లావూని కింద రాసిచ్చారు. అప్పాయపల్లి, దారారం, శ్రీరంగాపూర్, పలు తండాల కింద ఉన్న ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని కొత్త వ్యక్తుల పేర్లతో పట్టాలిచ్చేశారు.
* నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలో ఏకంగా 2000 పట్టాలు కొత్తగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో పట్టా జారీకి రూ.వేలల్లో చేతులు మారినట్లు సమాచారం’
*పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట పరిధిలో 96వ సర్వే నంబరులో కొందరు అనర్హులకు కూడా అక్రమంగా పట్టాలు జారీ చేశారు.
* కూడేరు మండలంలోని 429 సర్వే నంబరులో వాగును ఆనుకుని 500 ఎకరాల పట్టా భూమి ఉంది. 2018 తర్వాత మరో 500 ఎకరాలను అదనంగా కొందరు ఖాతాల్లోకి చేర్చారు.
ఆ జిల్లాల్లోనూ అక్రమాలు..
* నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మల్లారంలోని 130, 131, 132 సర్వే నంబర్లలో కొందరికి అక్రమంగా పట్టాలు జారీ చేశారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
*జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలిమెల, ఏటూరునాగారం మండలాల్లో అటవీ భూములకు పట్టాలిచ్చారు. కొన్నిచోట్ల భూమి ఎక్కడుందనేది లబ్ధిదారులకు సైతం తెలియకపోగా చేతిలో మాత్రం పాసుపుస్తకాలు ఉన్నాయి.
*నారాయణపేట జిల్లా బొమ్మన్‌పహాడ్ గ్రామ పరిధిలో 225, 110, 116, 117 సర్వే నంబర్లలో 1520 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం సందర్భంగా స్థానిక రెవెన్యూ సిబ్బంది సాయంతో కొందరు నాయకులు ఆ సర్వే నంబర్లలో భారీ విస్తీర్ణానికి అక్రమంగా పట్టాలు పొందారు.
ఇదీ చదవండి: Assigned lands: అసైన్డ్ భూములకు పట్టాలు.. వేల ఎకరాల ప్రభుత్వ భూములకు రెక్కలు