నారాయణపేట జిల్లాలో గల చిన్న, సన్నకారు రైతులు కల్లాలను నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు. జిల్లాలోని మరికల్ మండలం పూసలుపడ్, ధన్వాడ మండలం రాంకిష్టయ్యపల్లి, గొట్టుర్ గ్రామాల్లో సిమెంట్ కల్లాలపై వేసిన ధాన్యాన్ని పరిశీలించి.. రైతులను అభినందించారు.
ప్రభుత్వం చేపట్టిన ఎన్ఆర్ఈజీఎస్ కింద చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీలో కల్లాలు నిర్మించుకొనే సౌకర్యం ప్రభుత్వం కల్పించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సిమెంట్ కల్లాలను రైతులు తమ పొలం వద్దే నిర్మించుకోవచ్చని సూచించారు. సిమెంట్ కల్లాలపై ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల మూడు రోజుల్లో ధాన్యం ఎండే అవకాశం ఉందన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో 2,441 కల్లాలు చిన్న, సన్నకారు రైతులకు మంజూరయ్యాయని.. రైతులు త్వరగా కల్లాలను నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి జన్ సుధాకర్, మరికల్ ఎంపీడీవో యశోద, ఆయా గ్రామ సర్పంచులు, వ్యవసాయ అధికారులు ప్రదీప్ గౌడ్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.