Bandi sanjay with mngres workers: కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉపాధి హామీ నిధులను ఆపుతోంది కేసీఆరేనని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలకు అదనంగా మరో యాభై రోజులు పని కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నారాయణపేట జిల్లా దన్వాడ మండలం మణిపూర్ తండాలో ఉపాధి కూలీలతో మాట్లాడారు. మూడు నెలలుగా మాకు డబ్బులు రావడం లేదన ఆవేదన వ్యక్తం చేశారు. రోజు కూలీని కనీసం రూ.250 పెంచాలని బండి సంజయ్‌ను కోరారు.
పేదల కోసమే కేంద్రం 100 రోజుల పని దినాలు ప్రవేశ పెట్టిందని బండి సంజయ్ వివరించారు. ఉపాధి హామీ పథకం డబ్బులను కేంద్రం ప్రతి వారానికి ఒకసారి రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తోందని పేర్కొన్నారు. ఎండాకాలం అదనంగా మరో రూ.20 కూలీ కేంద్రం ఇస్తోందని తెలిపారు. పని ప్రదేశంలో మీకు ప్రథమ చికిత్స, నీరు ఏర్పాటు చేయాలన్నారు. ఇకపై రాష్ట్రంతో సంబంధం లేకుండా మీ ఉపాధి హామీ కూలీ డబ్బులు మీ అకౌంట్లలో పడేలా మోదీతో మాట్లాతానని హామీ ఇచ్చారు.
కేంద్రమే మీకు బియ్యం, వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చింది. మీకు న్యాయంగా వారానికే డబ్బులు ఇస్తాం. వందరోజుల పని మోదీ గారు ఇచ్చిండ్రు. ఇంకా అదనంగా యాభై రోజులు పెంచేందుకు కృషి చేస్తాం. పైసలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెడతాం. కూలీ పని చేసుకుంటున్న మీకు మూడు నెలలైనా కేసీఆర్ డబ్బులివ్వలేదు. మీరు పైసలు ఆపే అధికారం ఎవరికీ లేదు. ఎవరన్నా ఆపితే కేసు పెట్టొచ్చు. మీరు కష్టం చేస్తున్నరు. వారానికి పైసలు ఇవ్వకుంటే అధికారులను నిలదీయాలి. నేను ఓట్ల కోసం మీ వద్దకు రాలే. మీ కష్టాలను తెలుసుకునేందుకే వచ్చా. మన ప్రభుత్వం వస్తే మీ కష్టాలు తీరుతాయి.
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ప్రధాని మోదీ లక్షా 40 వేల ఇళ్లు మంజూరు చేశారని బండి సంజయ్ అన్నారు. అయినా కేసీఆర్ ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడం లేదన్నారు. కేంద్రం 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తుంటే.. కేసీఆర్ బియ్యాన్ని కిలో రూపాయికి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. పేదల కష్టాలు, బాధలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నానని బండి సంజయ్ తెలిపారు. కేంద్రం నిధులు ఇస్తుంటే... కమిషన్లకు కక్కుర్తిపడి ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం నిధులను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ కూడా పేదల ప్రభుత్వం వస్తేనే మీకు న్యాయం జరుగుతుందని తెలిపారు. నేను మీ ఓట్ల కోసం రాలేదని.. మీ సమస్యలు తెలుసుకునేందుకే వచ్చానన్నారు.
అనంతరం ధన్వాడ మండలం రామకిష్టయ్యపల్లి గ్రామంలో దివ్యాంగులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందని బండి సంజయ్ తెలిపారు. వికలాంగులంటే వివక్షతో చూస్తారని.. నరేంద్రమోదీ వారికి దివ్యాంగులు అని పేరు పెట్టారని గుర్తు చేశారు. మూడుశాతం ఉన్న రిజర్వేషన్లను 4 శాతానికి పెంచారని.. అగ్రకులాల్లో నిరుపేదలకు సైతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాను కేసీఆర్ అమలు చేయడం లేదని ఆరోపించారు.
దివ్యాంగులను గుర్తించి వారికి రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయాలన్నారు. యూపీలో యోగి 30 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చారని అందుకే అక్కడ భాజపా మళ్లీ విజయఢంకా మోగించిందన్నారు. మహబూబ్‌నగర్‌లో ఈనెల 5న జరిగే సభకు 15 వేల మంది దివ్యాంగులు రావాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలే దివ్యాంగుల వద్దకు వచ్చేలా పోరాడి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మార్పుతోనే దివ్యాంగులకు న్యాయం జరుగుతుందన్నారు. దివ్యాంగులు తలుచుకుంటే కేసీఆర్ గద్దె దిగడం ఖాయమన్నారు. దివ్యాంగుల వెనుక తెలంగాణ సమాజం, భాజపా, మోదీ ఉన్నారని భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి: '10 ఏళ్లు.. 16 లక్షల ఉద్యోగాలు.. రూ.2.5 లక్షల కోట్ల ఆదాయం'