ఉమ్మడి పాలమూరు జిల్లాలో భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జోరుగా కొనసాగుతోంది. 16వ రోజు నారాయణపేట మినీ క్రీడా మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్ సహా తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తున్నా.... ఆయా కేంద్రాల్లో కనీస వసతులు లేవని బండి మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ వ్యాట్ పేరుతో ఎనిమిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్న డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్లిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 317 జీవో తెచ్చి ఉద్యోగులను గోస పెడుతున్నారని ఆక్షేపించిన సంజయ్...... రైతులు, చేనేత కార్మికులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
తెరాస ప్లీనరీలో పాలమూరు జిల్లాలో వలసలు ఆగాయని ముఖ్యమంత్రి చెప్పారని, నారాయణపేట నుంచి మాత్రం ఇప్పటికీ ముంబయికి బస్సు వెళ్తోందని బండి సంజయ్ గుర్తు చేశారు. భాజపా అధికారంలోకి వస్తే మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు 2లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని..... RDS ద్వారా నీళ్లిచ్చి సశ్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. భాజపాను మతతత్వ పార్టీగా అభివర్ణించడంపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ నిఖార్సయిన హిందువైతే.... బైంసా, ఉట్కూర్‌లో జరిగిన దాడులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగురవేయడమే భాజపా లక్ష్యమని పునరుద్ఘాటించారు.
ఆంధ్రా రహదారులు బాగాలేవన్న కేటీఆర్‌కు.... ఇక్కడ ఎలా ఉన్నాయో తాము చూపిస్తామని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి సహా పలువురు నేతలు సభలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: