నల్గొండ జిల్లా చండూర్ మండలంలోని పుల్లెంల గ్రామంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP) అధ్యక్షురాలు షర్మిల(SHARMILA) నిరుద్యోగ నిరాహారదీక్ష(hunger strike against unemployment) చేపట్టారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహారదీక్షలో భాగంగా.. నేడు పుల్లెంల గ్రామంలో దీక్షలో పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి శ్రీకాంత్ కుటుంబాన్ని షర్మిల తొలుత పరామర్శించారు. అనంతరం స్థానిక చౌరస్తాలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలిలో వైఎస్ఆర్(YSR) చిత్ర పటానికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు.
![SHARMILA hunger strike, SHARMILA pullemla strike](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12585589_shar-1.jpg)
అండగా ఉంటాం
నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పాక శ్రీకాంత్ ఉద్యోగం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎమ్మెస్సీ పూర్తి చేసిన శ్రీకాంత్... ఉద్యోగం రాక మనస్తాపానికి గురై బలవన్మరణానికి ఒడిగట్టారు. ఆయన తండ్రి ఐదేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయారు. తల్లి మానసిక వికలాంగురాలు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన షర్మిల... వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
![SHARMILA hunger strike, SHARMILA pullemla strike](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12585589_shar-2.jpg)
భారీ మద్దతు
పుల్లెంలలో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష ఈ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు, వైఎస్సార్ అభిమానులు, పార్టీ శ్రేణులు మొత్తం 4000 మందికిపైగా మద్దతుదారులు హాజరయ్యారు.
![SHARMILA hunger strike, SHARMILA pullemla strike](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12585589_shar-3.jpg)
ప్రతి వారం- నిరుద్యోగ వారం
ప్రతి మంగళవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష వారం చేపడతానని షర్మిల వనపర్తి జిల్లా తాడిపత్రి పర్యటనలో చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వాటిని భర్తీ చేయాలనే డిమాండ్‌తో ప్రతివారం ఒక్కో జిల్లాలో దీక్ష ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తూ షర్మిల దీక్ష చేపడుతున్నారు. గతవారం ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఈ దీక్ష జరిగింది.
ఇవీ చదవండి: