Viral Fever in Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులని తేడాలేకుండా అన్నీ జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. వాతావరణ మార్పులతో మూడు జిల్లాల్లోనూ డెంగీ, మలేరియా, టైఫాయిడ్ బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రజలు విష జ్వరాలతో మంచాన పడుతున్నారు. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి.
Viral Fever Cases In Telangana : ముఖ్యంగా.. మూడు రోజులనుంచి ఈ మూడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీగా కేసులు పెరిగినట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అధికశాతం ప్రజలు దగ్గు, జలుబు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌లతో బాధపడుతూ.. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. రోగులకు సరిపడా బెడ్లు లేక ఇబ్బందులెదుర్కొవాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. పలు ప్రాంతాల్లోని పీఎచ్సీలు, బస్తీ దవాఖానాలకు ప్రజలు వరుస కడుతున్నారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోందని వైద్యులు సరిగా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
Viral Infection Remedies : ఇంటి చిట్కాలతో.. వైరల్ ఇన్ఫెక్షన్స్కు చెక్!
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ సాధారణంగా.. సగటున 500 నుంచి 600 కేసులు వస్తుంటాయి. కానీ మూడు రోజుల నుంచి 800 నుంచి వెయ్యిమంది వరకు వస్తున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇందులో 80 శాతం వరకు విషజ్వరాలు సంబంధిత కేసులే అధికంగా ఉన్నాయంటున్నారు. నల్గొండ చుట్టు పక్కల ప్రాంతాలనుంచే.. బాధితులు ఎక్కువగా వస్తున్నారని..పెరుగుతున్న కేసుల దృష్ట్యా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.
'' ఆస్పత్రిలో రోజూ విషజ్వరాలు సంబంధిత కేసులే అధికంగా వస్తున్నాయి. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్పత్రికి వచ్చిన ప్రతి రోగికి అన్ని పరీక్షలు చేస్తున్నాం. పూర్తిగా జ్వరం నయం అయ్యేవరకు వైద్య సేవలు చేస్తున్నాం. ఓపీ కోసం చాలా మంది లైన్లో ఉంటున్నారు. కాబట్టి సీరియస్గా ఉన్నవారికి ముందుగానే పంపించే సదుపాయం చేశాం. '' - లచ్చునాయక్, జీజీహెచ్ సూపరింటెండెంట్
Viral Fever Yadadri Bhuvanagiri District : గత రెండు నెలలుగా జిల్లాల్లో సీజనల్ వైరల్ జ్వరాలు వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యుడు పేర్కొన్నారు. బాధితులు మూడు రోజులుగా 100° డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు తప్పనిసరిగా వైద్యులకు చూయించుకోవాలని అన్నారు. ఇవి ఎక్కువగా దోమల ద్వారా మలేరియా , డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందుతుందని, పరిసరాలు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి గత నెలలో 16,480 మంది జ్వరంతో బాధపడుతున్న వారు ఓపీకి వచ్చారని , అందులో 400 వరకు వైరల్ జ్వరాలు ఉన్నట్లు ఆస్పత్రి సూపరిండెండెంట్ చిన్నా నాయక్ పేర్కొన్నారు. జ్వరాలతో అధికంగా గ్రామీణ ప్రాంతవాసులే బాధపడుతుండటంతో.. గ్రామాల్లో సంచారవైద్యసేవలు అందించాలని రోగులు కోరుతున్నారు.