Vajrateja Rice Cluster in Haliya, Nalgonda District: రాష్ట్రంలోనే తొలిసారిగా ధాన్యం పొట్టుతో పరిశ్రమకు కావాల్సిన విద్యుత్ తయారు చేసేలా నల్గొండ జిల్లా హాలియాలో వజ్రతేజ రైస్‌క్లస్టర్ నిర్మించారు. 7ఎకరాల్లో వందకోట్ల పెట్టుబడితో అతిపెద్ద పారాబాయిల్డ్ మిల్లును అందుబాటులోకి తెచ్చారు. పరిశ్రమలో ధాన్యం మర ఆడించడం ద్వారా వెలువడే పొట్టు ద్వారా విద్యుదుత్పత్తి, బూడిదను వాయురూపంలో మార్చి ‘యాష్‌కలెక్షన్ ప్లాంట్‌లో నిల్వచేయడం, నీటిని వృథా కాకుండా రీసైక్లింగ్ ద్వారా 70 శాతం పునర్వినియోగించడం ఈ మిల్లు ప్రత్యేకత. రైతుల నుంచి ఎటువంటి ధాన్యాన్నైనా మద్దతు ధరకు కొనడం, బియ్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కువకు అమ్మడం, పర్యావరణానికి ఎలాంటి హానిలేకుండా ఆ మిల్లు పనిచేస్తోంది. ఈ మిల్లు ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా మరో రెండున్నర వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
రోజుకు 700 టన్నుల ధాన్యాన్ని బియ్యంగా మార్చుతున్నారు: ప్లాంట్ నిర్వహణకు గంటకు 1.7 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా వడ్లపొట్టు ద్వారా గంటకు 1.3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. రోజూ 31 మెగావాట్లకు తగ్గకుండా కరెంట్ ఉత్పత్తి జరుగుతోంది. టర్బైన్లలో తయారైన విద్యుత్‌ను కంట్రోల్‌ప్యానల్ ద్వారా తిరిగి ప్లాంట్ నిర్వహణకు వాడుతున్నారు. టర్బైన్లకు 12 కోట్లు ఖర్చు చేయగా ఏడాదిన్నరలో తిరిగి వస్తుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. గంటకు 32 టన్నుల ధాన్యం మర ఆడించి రోజుకు 700 టన్నుల ధాన్యాన్ని బియ్యంగా మార్చుతున్నారు. రైతుల నుంచి 26 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని సేకరించినా బాయిల్డ్‌రైస్, రా రైస్‌ను తయారు చేస్తారు. సాంకేతికతతో బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాక వృధా తక్కువగా ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.
ఏడాదిన్నరలోనే పూర్తి: ఇటలీ, జపాన్, జర్మనీ, బెంగళూరు, చెన్నై, గోవానుంచి తెచ్చిన అధునాతనయంత్రాలను పరిశ్రమలో అమర్చారు. రైతులు ఎంత తేమ శాతం ఉన్న ధాన్యాన్ని తెచ్చినా ఇక్కడ కొనుగోలుకు అవకాశం ఉంది. పరిశ్రమ నిర్వహణకు నిత్యం 300 కిలో లీటర్ల నీరు అవసరం అవుతుండగా అందులో 210 లీటర్లను రీసైక్లింగ్‌లో తిరిగి ప్లాంటులో వాడుతున్నారు. టీఎస్ - ఐపాస్ సహకారంతో ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసి అనుమతులు పొంది, బ్యాంకుల సహకారంతో ఏడాదిన్నరలోనే ప్లాంట్‌ను నిర్మించామని యజమానులు వివరించారు.
రాష్ట్రంలో తొలిసారి పర్యావరణహితంగా నిర్మించిన వజ్రతేజ స్ఫూర్తితో మరింత మంది ఇదే తరహాలో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రైతులు, వినియోగదారులకు ఉపయుక్తంగా ఉన్న ఇలాంటి మిల్లులు మరిన్ని రావాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
"మేమే సొంతంగా ఈటీపీ కట్టుకున్నాము. 95శాతం నీరు అగ్రికల్చర్ కోసం వాడుకోడానికి వీలుగా నిర్మించుకున్నాము. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేస్తున్నాము. జపనీస్ టెక్నాలజీతో 18 నెలల్లో పూర్తి చేశాను." -యాదగిరి, పరిశ్రమ యజమాని
"రోజూ 10-15 బస్తాల ధాన్యాన్ని ఖరీదు చేసే అవకాశం ఉంది. ఒకసారి ధాన్యాన్ని ఖరీదు చేసినప్పటి నుంచి లారీలోకి వెళ్లేంత వరకు మ్యాన్‌పవర్ అవసరం లేదు. మాకు సరిపోయంత విద్యుత్ మేమే తయారు చేసుకోగల్గుతాం." - రైస్‌మిల్ ఉద్యోగి
ఇవీ చదవండి: