నల్గొండలోని జిల్లా కారాగారం, ప్రభుత్వాసుపత్రిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. జైలు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. నల్గొండ జిల్లాలో మొన్న ఆక్సిజన్ లేక కొడుకు చనిపోయాడని తల్లి ఆరోపించిన సంఘటనకు సంబంధించిన వీడియో రాష్ట్రంలో సంచలనంగా మారిందన్నారు. ఆక్సిజన్ లేక ఒక వ్యక్తి చనిపోవడమనేది చాలా దారుణమని అభిప్రాయపడ్డారు. ఆస్పత్రిలో ఆక్సిజన్, వెంటిలేటర్ల వంటి సదుపాయాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు.
మూఢ నమ్మకాలతో వందల కోట్లు
హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో నలుగురు వ్యక్తులు.. ఫీవర్ ఆస్పత్రిలో ఒక వ్యక్తి.. ఆక్సిజన్ లేక చనిపోయారని చెప్పారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తన మూఢ నమ్మకాలతో వందల కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మించడం అవసరమా అని ప్రశ్నించారు. పాత సచివాలయం బాగానే ఉందని అన్నారు.
తప్పుడు లెక్కలు
రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా పరీక్షల విషయంలో తప్పుడు లెక్కలు చూపిస్తుందని ఆరోపించారు. కరోనాతో చనిపోతే ఇంకేదో కారణంతో చనిపోయినట్లు చూపుతున్నారని పేర్కొన్నారు. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని సూచించారు. కరోనా సమయంలో ముందుండి పోరాడుతున్న మున్సిపల్ కార్మికులు, మెడికల్ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : అమానవీయం: కరోనా భయంతో వర్షంలోనే మృతదేహం