నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తెరాస విజయం సాధించింది. కాంగ్రెస్ నేత జానారెడ్డిపై 18,872 ఓట్ల తేడాతో తెరాస అభ్యర్థి నోముల భగత్ విజయం సాధించారు. భాజపా అభ్యర్థి రవి నాయక్ డిపాజిట్ కోల్పోయారు. నోముల భగత్‌కు 89,804 ఓట్లు రాగా జానారెడ్డికి 70,932, రవి నాయక్‌కు 7,676 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి 2,915 ఓట్లు రాగా తెదేపా అభ్యర్థికి 1,714 ఓట్లు పోలయ్యాయి.
కౌంటింగ్ ప్రారంభం నుంచి నోముల భగత్ ఆధిక్యంలో కొనసాగారు. నోముల నరసింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నిక జరిగింది. తెరాస నుంచి నరసింహయ్య తనయుడు నోముల భగత్ పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానా రెడ్డి, భాజపా నుంచి రవి నాయక్ బరిలో నిలించారు. గత నెల 17 పోలింగ్ జరిగింది.
తనపై నమ్మకం ఉంచి గెలిపించిన నాగార్జున సాగర్ ప్రజలకు తెరాస అభ్యర్థి నోముల భగత్ ధన్యవాదాలు తెలిపారు. తనకు టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాన్న నరసింహయ్య చనిపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తానన్నారు.
ఇదీ చదవండి: భగత్‌ను ఆశీర్వదించిన సాగర్ ప్రజలకు ధన్యవాదాలు: సీఎం