ఖరారైన మునుగోడు ఉపఎన్నికలో గెలుపు జెండా ఎగురవేసేందుకు తెరాస వ్యూహాలకు పదును పెడుతోంది. కొన్నిరోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యవహారంపై అంతర్గత సర్వేలు, పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణలో నిమగ్నమైన గులాబీ పార్టీ.. ఉప ఎన్నిక బరిలో విజేతగా నిలిచేందుకు సర్వశక్తులను సమాయత్తం చేస్తోంది. మునుగోడుపై కొన్ని నెలలుగా అప్రమత్తంగా ఉన్న తెరాస.. అమిత్ షాను కోమటిరెడ్డి రాజగోపాల్ కలవగానే కార్యాచరణను ప్రారంభించింది. మంత్రి జగదీష్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితర జిల్లా ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చర్చిస్తూనే ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ బృందంతో పాటు వివిధ ఏజెన్సీల నుంచి పలు అంశాలపై సర్వేలు చేయించి నివేదికలు తెప్పించారు. భాజపా, కాంగ్రెస్ బలాలు, బలహీనతలు, సొంత పార్టీ నేతలు, ప్రభుత్వ పనితీరు, పథకాలపై ప్రజాభిప్రాయం తదితర కోణాల్లో సర్వేలు చేయించారు. ఉప ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాతో తెరాస ఉంది.
వరాలు కుమ్మరించేందుకు సన్నాహాలు..: మునుగోడు ఉప ఎన్నికల్లో బహుముఖ వ్యూహాలను అమలు చేసేందుకు తెరాస సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రాజీనామా చేయడంతో... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపారు. మంత్రి జగదీష్ రెడ్డి నియోజకవర్గంలోని మండలాల నేతలతో భేటీ అయ్యారు. గులాబీ దళం త్వరలో నియోజకవర్గంలో మోహరించనుంది. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలకంగా వ్యవహరించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ రంగంలోకి దిగనున్నారు. ఇతర జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ప్రచారం చేయనున్నారు. మండలాలు, మునిసిపాలిటీల వారీగా నేతలకు త్వరలో బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రచార అంశాలు, వ్యూహాలను త్వరలో ఖరారు చేయనున్నారు. ప్రచారంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తూ.. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేందుకు పార్టీ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇటీవలే గట్టుప్పల్ మండల కేంద్రాన్ని ప్రకటించిన తెరాస సర్కారు.. మరిన్ని వరాలు కుమ్మరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఆశావహుల పోటీ..: కాంగ్రెస్‌లోని నియోజకవర్గ స్థాయి నేతలపై ఆకర్ష్ వ్యూహాన్ని సంధించేందుకు తెరాస ఎత్తుగడలు వేస్తోంది. తమ బలాన్ని పెంచుకోవడంతో పాటు.. ప్రత్యర్థి పార్టీ నేతలను కారెక్కించేలా ప్రణాళికలను చేస్తోంది. వివిధ పార్టీలకు చెందిన స్థానిక నేతలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు టికెట్ కోసం పలువురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. దాదాపు పది మంది నేతలు టికెట్ కోసం కేసీఆర్, కేటీఆర్‌ను ఒప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నియోజకవర్గంతో పాటు మీడియా, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ అటు అధిష్టానం... ఇటు ప్రజల దృష్టిలో పడేందుకు చెమటోడ్చుతున్నారు.
అప్పుడే అభ్యర్థిపై తుది నిర్ణయం..: అభ్యర్థి ఎంపికపై తెరాస అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాకే అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అభ్యర్థి లేకుండా గులాబీ జెండా.. కేసీఆర్ అజెండాలతో ప్రచారం సాగించాలని నిర్ణయించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, తెరాస నేతలు కర్నాటి విద్యా సాగర్, కంచర్ల కృష్ణారెడ్డి, నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీటీసీ రవి తదితరులు టికెట్ రేసులో ఉన్నారు. టికెట్ ఆశిస్తున్న నేతలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను వివిధ వర్గాల నుంచి సేకరిస్తున్నారు.