నల్గొండ జిల్లాలో ఒకేసారి పెద్దమొత్తంలో ధాన్యం తీసుకురాకుండా కట్టడి చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్లును జారీ (Nalgonda farmers token issue ) చేస్తున్నారు. టోకెన్లు ఉన్నవారే పంటలు కోతలు చేపట్టాలని నిర్దేశించారు. అయితే ఈ విధానంతో అన్నదాతలు అవస్థలు పడాల్సి వస్తోంది. తెల్లవారుజాము నుంచే టోకెన్ పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. గంటలపాటు నిరీక్షించినా కొంతమంది నిరాశగా వెనుదిరగాల్సివస్తోంది.
ఒక టోకెన్ మాత్రమే ఇస్తుండటంతో
మిర్యాలగూడ, వేములపల్లి మండలాల్లో రసీదులు పొందేందుకు నాలుగైదు గంటల పాటు వేచిచూశారు. వేములపల్లిలో వచ్చే ఈ నెల 6, 7, 8 తేదీలకు గాను రోజుకు 200 చొప్పున 600 టోకెన్లు అందజేశారు. మిర్యాలగూడలోనూ రోజుకు 400 చొప్పున మూడు రోజులకు 1,200లు పంపిణీ చేశారు. అయితే ఒక్కరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తుండటంతో ఎక్కువ విస్తీర్ణంలో పంట పండిస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.
![Token issues for Nalgonda farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13553539_token.png)
మా పంట కోసేందకు టోకెన్లు ఏంటి
తమ పంట తాము కోసేందుకు టోకెన్లు (Nalgonda farmers token issue ) ఏంటంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళనకు దిగుతున్నారు. గరిడేపల్లి, నేరేడుచర్ల మండలాల్లో కోదాడ- మిర్యాలగూడ జాతీయ రహదారిపై అన్నదాతలు ధర్నా చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు ఇన్ని అవస్థలు పడాల్సివస్తోందని గోడు వెళ్లబోసుకున్నారు. టోకెన్లు అందక పంట పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![Token issues for Nalgonda farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13553539_nlg-token-1.png)
ప్రతి గ్రామంలోనూ అందించాలి
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము నడుచుకుంటున్నామని వ్యవసాయ విస్తరణ అధికారులు చెబుతున్నారు. నిర్దేశించిన ప్రకారం టోకెన్లు (Nalgonda farmers token issue ) జారీ చేస్తున్నామన్నారు. పలు మండలాల్లో ఇప్పటికే 70 శాతం కోతలు పూర్తయ్యాయని.... మిగతావి ప్రణాళికబద్ధంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా ప్రతి గ్రామంలోనూ... అందరికీ సరిపడా టోకెన్లు అందించాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి : ధాన్యం కొనడం లేదని రోడ్డెక్కిన అన్నదాత.. క్యూలైన్లో పడిగాపులు