Congress lost the deposit in munugode: మునుగోడులో ఓటమితో కాంగ్రెస్ పార్టీ మరో స్థానం కోల్పోయింది. గతంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఈసారి డిపాజిట్ కూడా కోల్పోయింది. కాంగ్రెస్ స్థానాన్ని తెరాస భర్తీ చేసింది. ఈ గెలుపుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని స్థానాలను తెరాస కైవసం చేసుకున్నట్లైంది.
మునుగోడు ఉపఎన్నికలో తెరాస విజయం సాధిస్తే.. భాజపా రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయింది. మహిళల ఓటర్ల మీద ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. మహిళలెవరూ హస్తం పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నది.. ఈ ఫలితాలను చూస్తే అర్థం అవుతోంది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంటూ ఒకటి ఉందనే విషయాన్ని జనం మర్చిపోయే పరిస్థితి ఎదురవుతోంది. గత ఉపఎన్నిక నాగార్జున సాగర్‌లోనూ తెరాస అభ్యర్థి నోముల భగత్.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై భారీ మెజార్టీతో గెలుపొందారు.
వరుస పరాజయాలు.. నేతల జంపింగ్‌లు.. పార్టీకి తీవ్రనష్టాన్ని చేకూర్చాయి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సరైనా నాయకత్వం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలోనూ ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఓటు బ్యాంకు... భాజాపాకు టర్న్ అయిందనే అనుకోవాల్సి ఉంటుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లోనైనా పుంజుకుంటుందో లేదో చూడాలి.
నియోజకవర్గంలో 1962 నుంచి 1985 వరకు కాంగ్రెస్ నుంచి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి గెలుపొందగా... 1985 నుంచి 99 వరకు కమ్యూనిష్టు పార్టీ నుంచి నారాయణ రావు ఎన్నికయ్యారు. ఇక 1999–04లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 2004–09లో కమ్యూనిష్టు పార్టీ నుంచి పల్లా వెంకట్‌రెడ్డి విజయం సాధించగా... 2009–14లో అదే పార్టీ నుంచి యాదగిరి రావు ఎన్నికయ్యారు.
2014 నుంచి 2018 వరకు తెరాస నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రావు గెలుపొందగా... 2018–2022 వరకు కాంగ్రెస్ నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యం కాగా... ఈసారి మళ్లీ తెరాస విజయఢంకా మోగించింది.
ఇవీ చూడండి: